![train travel insurance just 35 paise process to claim compensation up to Rs 10 lakh - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/3/train_travel_insurance.jpg.webp?itok=hOUTOLCp)
Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం అందరినీ కలిచివేసింది. శుక్రవారం (జూన్ 2) జరిగిన ఈ దుర్ఘటనలో 280 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణ బీమా ఆవశ్యకత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
బాలాసోర్ రైలు ప్రమాద బాధితులకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50,000 ప్రకటించారు. అయితే ఐఆర్‌సీటీసీలో టికెట్లను బుక్ చేసుకునేటప్పుడు కనిపించే ప్రయాణ బీమా ఆప్షన్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
35 పైసలతో రూ.10 లక్షలు
రైల్వే టికెట్లు బుక్ చేసుకునే సమయంలో రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది. అయితే కొంత మంది ఈ ఆప్షన్ పట్టించుకోరు. కేవలం ప్రమాదాలు జరిగిప్పుడే కాకుండా ఈ బీమా ద్వారా ఇంకా ఇతర ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ఐఆర్‌సీటీసీ కేవలం 35 పైసలు మాత్రమే తీసుకుంటుంది. రూ. 10 లక్షల వరకు బీమా కవరేజీని అందిస్తుంది. ఈ బీమా కింద ప్రయాణికులు తమ రైలు ప్రయాణంలో విలువైన వస్తువులు, లగేజీని పోగొట్టుకుంటే పరిహారం లభిస్తుంది.
అలాగే ప్రమాదం జరిగినప్పుడు చికిత్సకు అయ్యే ఖర్చులు, ఒకవేళ మరణం సంభవించినప్పుడు వారి కుటుంబానికి పరిహారం అందిస్తారు. ఏదైనా రైలు ప్రమాదం జరిగినప్పుడు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ. 10 లక్షల వరకు బీమా మొత్తం చెల్లిస్తారు. పాక్షికంగా అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైతే రూ.10,000 వరకు అందజేస్తారు.
క్లెయిమ్ చేయడమెలా?
ఐఆర్‌సీటీసీ లేదా ఇతర అధీకృత యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌చేస్తున్నప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎంచుకోవాలన్న సూచన మనకు కనిపిస్తుంది. అయితే దీన్ని ఎంచుకోవాలా వద్దా అన్నది పూర్తిగా ప్రయాణికుల ఇష్టం. దీన్ని ఎంచుకున్న ప్రయాణికులు లేదా వారి కుటుంబ సభ్యులు వారు ప్రయాణించిన రైలు ప్రమాదానికి గురైన 4 నెలల్లోపు బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లి బీమా కోసం క్లెయిమ్‌ను దాఖలు చేయవచ్చు. అయితే బీమాను ఎంచుకునే సమయంలో ప్రయాణికులు తప్పనిసరిగా నామినీ పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవడంలో ఎలాంటి సమస్య ఉండదు.
ఇదీ చదవండి ➤ Oldest Real Estate Agent: 74 ఏళ్ల వయసులో రియల్‌ఎస్టేట్ ఏజెంట్! పరీక్ష రాసి మరీ..
Comments
Please login to add a commentAdd a comment