ఆన్‌లైన్‌ కోర్సులపై పెరుగుతున్న విశ్వాసం | Trust in Online Learning Continues to Grow Annual Insights by Physics Wallah | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ కోర్సులపై పెరుగుతున్న విశ్వాసం

Published Wed, Jan 10 2024 9:23 AM | Last Updated on Wed, Jan 10 2024 9:25 AM

Trust in Online Learning Continues to Grow Annual Insights by Physics Wallah - Sakshi

హైదరాబాద్‌: విద్యార్థుల్లో ఆన్‌లైన్‌ కోర్సులు, అభ్యాసం పట్ల విశ్వాసం పెరుగుతూనే (కరోనా అనంతరం) ఉందని ప్రముఖ ఆన్‌లైన్‌ శిక్షణా సంస్థ ఫిజిక్స్‌ వాలా వెల్లడించింది. ఫిజిక్స్‌ వాలా తన మొబైల్‌ అప్లికేషన్‌ను వినియోగించే 27 లక్షల మంది విద్యార్థులు, 4 కోట్ల యూట్యూబ్‌ చందాదారుల వీక్షణ డేటా ఆధారంగా ఈ వివరాలను విడుదల చేసింది.

ఫిజిక్స్‌ వాలా పెయిడ్‌ కోర్సుల్లో 2022లో 8.5 లక్షల మంది చేరగా, 2023లో వీరి సంఖ్య 24 లక్షలకు పెరిగినట్టు తెలిపింది. అంటే ఏడాదిలో 183 శాతం మంది విద్యార్థులు పెరిగారు. ఆన్‌లైన్‌ కోర్సులపై పెట్టుబడులు పెట్టడానికి విద్యార్థులు సముఖంగా ఉన్నారనే దానికి ఇది నిదర్శనమని పేర్కొంది. ఫిజిక్స్‌ వాలా యాప్‌ డౌన్‌లోడ్‌లు సైతం 2022లో 68 లక్షలుగా ఉంటే, 2023లో 94 లక్షలకు పెరిగినట్టు తెలిపింది. 2023 డిసెంబర్‌ నాటికి మొత్తం డౌన్‌లోడ్‌లు 1.62 కోట్లకు చేరినట్టు వెల్లడించింది. అందుబాటు ధరలు, నాణ్యమైన కంటెంట్‌ను సానుకూలతలుగా పేర్కొంది.

యూట్యూబ్‌ ఛానళ్ల ద్వారా విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తూ విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడుతున్నట్టు ఫిజిక్స్‌ వాలా ప్రకటించింది. 81 యూట్యూబ్‌ చానళ్ల ద్వారా తాము లక్షకు పైగా కంటెంట్‌ పీస్‌లను అప్‌లోడ్‌ చేశామని, 20 కోట్ల గంటల పాటు విద్యార్థులు చూశారని వివరించింది. ఇది తమ పెయిడ్‌ కోర్సుల్లో మరింత మంది విద్యార్థులు చేరేలా దోహదం చేస్తున్నట్టు తెలిపింది. తమ ప్లాట్‌ఫామ్‌పై ఒక్కో విద్యార్థి రోజువారీ వెచ్చించే సగటు సమయం కూడా 50 నిమిషాల నుంచి 65 నిమిషాలకు పెరిగినట్టు పేర్కొంది. సందేహాలు అడిగి, వాటిని తీర్చుకునే విద్యార్థుల సంఖ్య 2023లో 200 శాతం పెరిగినట్టు తెలిపింది. సంప్రదాయ తరగతి గదుల్లో మాదిరే ఆన్‌లైన్‌లోనూ సందేహాలు అడిగి, తీర్చుకునే విషయంలో విద్యార్థులు సౌకర్యంగా ఉంటున్నట్టు వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement