
బెర్క్ షైర్ హాత్వే ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ సీఈఓ వారెన్ బఫెట్ ఎట్టకేలకు కంపెనీ వద్ద పోగైన 321 బిలియన్ డాలర్ల(సుమారు రూ.26 లక్షల కోట్లు) నగదు నిల్వలకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. బఫెట్ తన పెట్టుబడి వ్యూహాన్ని, తాను లక్ష్యంగా పెట్టుకోవాలనుకుంటున్న రంగాలను వివరిస్తూ షేర్ హోల్డర్లకు తాజాగా వార్షిక లేఖ విడుదల చేశారు.
బెర్క్ షైర్ హాత్వే నగదు, ట్రెజరీ బిల్లు హోల్డింగ్స్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరాయి. ఇది బఫెట్ పెట్టుబడి వ్యూహం, మార్కెట్ దృక్పథంపై ప్రశ్నలను లేవనెత్తింది. గత కొన్ని త్రైమాసికాలుగా బెర్క్ షైర్ ఈక్విటీ సెక్యూరిటీలను బారీగా అమ్ముతూ వచ్చింది. దాంతో కంపెనీ వద్ద దాదాపు 321 బిలియన్ డాలర్ల(సుమారు రూ.26 లక్షల కోట్లు) మొత్తం సమకూరింది. టాప్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ ఇలా భారీగా అమ్మకాలు చేపట్టడం వెనుక గల కారణాలపై ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో అధిక వాల్యుయేషన్లు, ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను కనుగొనడం సవాలుగా మారాయని బఫెట్ స్పష్టత ఇచ్చారు.
వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళికలు
బెర్క్ షైర్ హాత్వే పెట్టుబడి విధానం ఎల్లప్పుడూ మంచి వ్యాపారాలను సరసమైన ధరలకు కొనుగోలు చేయడంపై కేంద్రీకృతమై ఉంటుందని బఫెడ్ తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో సరైన అవకాశాల కోసం ఓపికగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. బెర్క్ షైర్ నగదు నిల్వలను ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్న కొన్ని విభాగాలు కింది విధంగా ఉన్నాయి.
ఈక్విటీ పెట్టుబడులు: ఈ విభాగంలో ఇటీవల స్టాక్ అమ్మకాలు ఉన్నప్పటికీ బఫెట్ స్థిర ఆదాయ పెట్టుబడుల కంటే ఈక్విటీలపై నమ్మకంగా ఉన్నట్లు తెలిపారు. బెర్క్ షైర్ మెరుగైన నియంత్రిత యాజమాన్యంలోని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తుందని నొక్కి చెప్పారు.
జపాన్ మార్కెట్‌పై ఆసక్తి: సంస్థ వద్ద ఉన్న నగదులో కొంత బఫెట్ జపాన్‌లోని ఐదు అతిపెద్ద వాణిజ్య సంస్థలైన ఇటోచు, మరుబెని, మిత్సుబిషి, మిత్సుయి, సుమిటోమోల్లో పెట్టుబడి పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా కంపెనీల్లో బెర్క్ షైర్ హాత్వే ఇన్వెస్ట్ చేసింది.
అమెరికా కంపెనీలు: బఫెట్ అధిక వాల్యుయేషన్ల విషయంలో అప్రమత్తంగా ఉన్నప్పటికీ తన పెట్టుబడి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న యూఎస్ కంపెనీలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. బెర్క్ షైర్ డీర్, యునైటెడ్ పార్సిల్ సర్వీస్, సీవీఎస్ హెల్త్ వంటి కంపెనీల్లో కొనుగోళ్లను పరిగణిస్తున్నట్లు తెలిపింది.
ట్రెజరీ బిల్లులు: బెర్క్ షైర్ స్టాక్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని యూఎస్ ట్రెజరీ బిల్లుల్లో తిరిగి పెట్టుబడి పెడుతోంది. ఈ వ్యూహం మరింత ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాల కోసం లిక్విడిటీ రాబడిని అందిస్తుంది.
ఇదీ చదవండి: లకారానికి దగ్గర్లో గోల్డ్‌రేటు.. ఈ దేశాల్లో చీప్‌గా కొనుగోలు
సహనం ప్రాముఖ్యత
బఫెట్ ఇన్వెస్ట్‌మెంట్ విధానం పెట్టుబడిలో సహనం, క్రమశిక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఓపిగ్గా వేచి చూస్తే తప్పకుండా మంచి రాబడులు అందుకోవచ్చని బఫెట్ నిరూపించారు. తక్కువ రిస్క్, గణనీయమైన రాబడిని అందించే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ వైఖరి చాలా సంవత్సరాలుగా బెర్క్ షైర్‌కు బాగా ఉపయోగపడింది. ఇది మార్కెట్ తిరోగమనాన్ని కూడా అవకాశంగా మలుచుకునేందుకు తోడ్పడింది.
Comments
Please login to add a commentAdd a comment