టోకు ధరలు.. రికార్డ్‌ | Wholesale inflation hits record high in May | Sakshi
Sakshi News home page

టోకు ధరలు.. రికార్డ్‌

Published Tue, Jun 14 2022 5:02 PM | Last Updated on Wed, Jun 15 2022 2:11 AM

Wholesale inflation hits record high in May - Sakshi

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మేలో రికార్డు స్థాయిలో 15.88 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే ఈ బాస్కెట్‌లోని ఉత్పత్తుల ధరలు 15.88 శాతం పెరిగాయన్న మాట. క్రూడ్‌ ఆయిల్‌ ధరల తీవ్రత, సరఫరాలపై వేసవి సంబంధ సమస్యలు, కూరగాయలు, పండ్ల ధరల పెరుగుదల వంటి అంశాలు దీనికి కారణం.

సూచీ పెరుగుదల రెండంకెలపైన కొనసాగడం ఇది వరుసగా 14వ నెల కావడం గమనార్హం. ఇక నాలుగు నెలల నుంచి అసలు దిగువముఖం లేకుండా టోకు ద్రవ్యోల్బణం పెరుగుతూనే వస్తోంది.  ధరల తీవ్రత నేపథ్యంలో మరోదఫా రేట్ల పెంపు ఖాయమన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. మే తొలి వారం తర్వాత సెంట్రల్‌ బ్యాంక్‌ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను రెండు దఫాలుగా (0.40 శాతం, 0.50 శాతం చొప్పున) 4.9 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.  

కీలక విభాగాలు చూస్తే... 
♦నాలుగు నెలల తర్వాత ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం రెండంకెలను దాటింది. ఏప్రిల్‌లో 8.35 శాతం ఉన్న ఫుడ్‌ ఆర్టికల్స్‌ సూచీ మేలో 12.34 శాతంగా నమోదయ్యింది. జనవరిలో 10.40 శాతం చూసిన ఈ విభాగం అటు తర్వాత తగ్గుతూ వచ్చింది. కూరగాయలు (56.36 శాతం) ఆలూ (24.83%), గోధుమలు (10.55 శాతం), ప్రొటీన్‌ రిచ్‌.. గుడ్లు, మాంసం, చేపల (7.78%) ధరలు పెరిగాయి. అయితే ఉల్లిపాయల ధరలు మాత్రం పెరక్కపోగా 20.40% తగ్గాయి. ఆయిల్‌ సీడ్స్‌ ధర 7.08 శాతం ఎగసింది.  
♦ఇంధనం, పవర్‌ విభాగంలో ద్రవ్యోల్బణం ఏకంగా 40.62%గా నమోదయ్యింది. క్రూడ్‌ పెట్రోలియం, నేచురల్‌ గ్యాస్‌ ధర 79.50% ఎగసింది.  
♦తయారీ ఉత్పత్తుల ధరలు 10.11% ఎగశాయి. 

రేటు పెంపు.. మెజారిటీ అంచనా 
కాగా, తీవ్ర ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్‌బీఐ రెపో రేటు పెంపు ధోరణిని కొనసాగిస్తుందని మెజారిటీ నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రెండు ద్వైమాసిక సమావేశాల్లో ఆర్‌బీఐ 60 బేసిస్‌ పాయింట్ల రెపో రేటు పెంచుతుందన్న అభిప్రాయాన్ని ఇక్రా చీఫ్‌ ఎకనమిస్ట్‌ అతితీ నాయర్‌ పేర్కొన్నారు. డిసెంబర్‌ నాటికి రెపో రేటు 100 బేసిస్‌ పాయింట్లు పెరుగుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ పేర్కొంది.

ఇదే జరిగితే ఈ రేటు 5.9 శాతానికి చేరుతుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ముగింపు కనబడని నేపథ్యంలో క్రూడ్‌ ఆయిల్‌ ధరల్లో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగుతాయని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ పేర్కొంది. సమీప భవిష్యత్తులో టోకు ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిపైనే కొనసాగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 2022–23లో 50 నుంచి 75 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేటు పెరుగుతుందన్న అంచనాలనూ వెలువరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement