గడిచిన రెండేళ్లలో విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య 26 కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా 2024’ వైమానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. 2047 నాటికి విమానయాన రంగం 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ముంబయి, దిల్లీలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గుర్తిచేశారు. ఉడాన్ పథకం కింద జమ్మూకశ్మీర్‌లో హెలికాప్టర్ ప్రయాణాలు అమలు చేస్తున్నామని చెప్పారు. డ్రోన్‌లకు డిమాండ్ పెరగడంతో.. మహిళా పైలట్లను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉడాన్ 5.3ను మంత్రి ప్రారంభించారు. సమావేశంలో పలు విమానయాన సంస్థల మధ్య ఒప్పందాలు జరిగాయి.
తెలంగాణలో ఎన్నో అవకాశాలు -మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో ఏవియేషన్ రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. సులభతర వాణిజ్య విధానం ఇక్కడ అమలవుతోందని చెప్పారు. ఏరో స్పేస్ పెట్టుబడులకు హైదరాబాద్ ఎంతో అనుకూలం. డ్రోన్ పైలట్లకు ఎక్కువగా శిక్షణ ఇచ్చి.. వ్యవసాయం, అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల్లో డ్రోన్లు వినియోగిస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ప్రాజెక్టు దక్కించుకున్న కంపెనీ ఇదే..
వింగ్స్ ఇండియా 2024 సందర్శకులకు 20, 21వ తేదీల్లో అనుమతిస్తారు. భారత వాయుసేనకు చెందిన సారంగ్ బృందం ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు విన్యాసాలు నిర్వహించనుంది.
- 18న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు, సాయంత్రం 4.15 నుంచి 5 వరకు విన్యాసాలుంటాయి.
- 19న ఉదయం 11 నుంచి 12 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు, సాయంత్రం 4.15-5 వరకు విన్యాసాలు ఉంటాయి.
- 20, 21వ తేదీల్లో సందర్శకులను అనుమతించనున్నారు.
- టికెట్ రూ.750గా నిర్ణయించారు.
- ‘బుక్‌మైషో’ యాప్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. మూడేళ్లలోపు పిల్లలకు ఉచితం.
- 30 అడుగుల దూరంలో బారికేడ్ల నుంచి మాత్రమే చూసే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment