న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మహిళలు క్రమంగా పాగా వేస్తున్నారు. ఫండ్ మేనేజర్ల విభాగంలో మహిళల ప్రాతినిధ్యం భారత్‌లో పెరిగినట్టు మార్నింగ్‌స్టార్ నివేదిక తెలియజేసింది. అయితే దేశంలోని మొత్తం ఫండ్ మేనేజర్లలో మహిళల వాటా ఇప్పటికీ 8 శాతం స్థాయిలోనే ఉన్నట్టు పేర్కొంది. ‘‘376 ఫండ్ మేనేజర్లకు గాను 30 మందే మహిళలు ఉన్నారు. వీరు ప్రైమరీ లేదా సెకండరీ ఫండ్ మేనేజర్లుగా ఈక్విటీ, డెట్ ఫండ్స్‌కు సేవలు అందిస్తున్నారు. గతేడాది మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య 28. మొత్తం 19 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పరిధిలో 30 మంది మహిళా ఫండ్ మేనేజర్లు పనిచేస్తున్నారు. వీరి కాల వ్యవధిని పరిశీలిస్తే.. 10 మంది గడిచిన ఐదేళ్లుగా నిలకడగా ఫండ్స్ నిర్వహణ చూస్తున్నారు.
మరో 12 మంది మూడు నుంచి ఐదేళ్లుగా ఫండ్స్ నిర్వహణ బాధ్యతలో ఉన్నారు. ఇక 8 మంది మహిళా ఫండ్ మేనేజర్ల కాల వ్యవధి చాలా తక్కువగానే ఉంది’’ అని మార్నింగ్ స్టార్ నివేదిక వివరించింది. 2021 జనవరి నాటికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని మొత్తం ఇన్వెస్టర్ల ఆస్తులు రూ.30.50 లక్షల కోట్లకు వృద్ధి చెందిన విషయం తెలిసిందే. ‘‘మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2017లో మార్నింగ్ స్టార్ నివేదికను విడుదల చేసే నాటికి మహిళా ఫండ్ మేనేజర్ల సంఖ్య 18గా ఉంది. 2018లో 24కు, 2019లో 29కు చేరుకోగా, 2020లో 28.. 2021 నాటికి 30కు చేరుకుంది. 8 శాతం మంది మహిళా మేనేజర్లు అంటే మ్యూచు వల్ ఫండ్స్ పరిశ్రమలో చాలా తక్కువ ప్రాతినిధ్యమే’’ అని మార్నింగ్ స్టార్ నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment