మహిళలూ.. మళ్లీ కెరీర్‌ ప్రారంభించండి! | Work-at-Home Career Ideas for Women | Sakshi
Sakshi News home page

మహిళలూ.. మళ్లీ కెరీర్‌ ప్రారంభించండి!

Published Tue, Apr 20 2021 5:17 AM | Last Updated on Tue, Apr 20 2021 5:17 AM

Work-at-Home Career Ideas for Women - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పెళ్లి, పిల్లలు, బాధ్యతలు, ఆరోగ్యం.. కారణమేదైనా కావొచ్చు. ఉద్యోగాలను మధ్యలోనే వదిలేసిన మహిళలు ఎందరో. ఉన్నత చదువులు చదివి, పెద్ద సంస్థల్లో జాబ్‌ సంపాదించిన వారూ వీరిలో ఉన్నారు. ఇప్పుడు వీరికి మేమున్నామంటూ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అవసరమైతే నైపుణ్య శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగావకాశాలను  కల్పిస్తున్నాయి. వర్క్‌ ఫ్రం హోం విధానం పుణ్యమాని ఇప్పుడు జాబ్‌ మార్కెట్‌లో సమూల మార్పులొస్తున్నాయి. ఈ విధానాన్ని ఆసరాగా చేసుకుని గిగ్‌ మోడల్‌ సైతం పాపులర్‌ అవుతోంది. ల్యాప్‌టాప్, ఇంటర్నెట్‌ ఉంటే చాలు.. ఎంచక్కా ఇంటి నుంచి పని చేస్తూ మహిళలు తమ కెరీర్‌ను తిరిగి ప్రారంభిస్తున్నారు.

ప్రత్యేక కార్యక్రమాల ద్వారా..
ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్, ఈ–కామర్స్, ఫైనాన్షియల్‌ రంగాల్లో ఉద్యోగాలు మానేసిన మహిళలను తిరిగి చేర్చుకోవడానికి ప్రత్యేక డ్రైవ్‌లను కంపెనీలు చేపడుతున్నాయి. మైక్రోసాఫ్ట్, క్యాప్‌జెమిని, టీసీఎస్, వర్చూసా, వీఎంవేర్, ఐహెచ్‌ఎస్‌ మార్కిట్, యూబీఎస్‌.. ఇలా ఎన్నో కంపెనీలు ముందుకొస్తున్నాయి. కంపెనీల సామాజిక బాధ్యతలో భాగంగా ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌లో మహిళలకు అవసరమైన శిక్షణ ఇచ్చి మరీ విధుల్లోకి తీసుకుంటున్నాయి. కంపెనీల భవిష్యత్‌ ఆర్థిక పనితీరును అంచనా వేయడానికి ఎన్విరాన్‌మెంటల్, సోషియల్, కార్పొరేట్‌ గవర్నెర్స్‌ను పెట్టుబడి సంస్థలు పరిగణలోకి తీసుకుంటున్నాయి. కింది స్థాయి నుంచి బోర్డు వరకు మహిళల ప్రాతినిధ్యం ఉన్న కంపెనీల్లోనే పెట్టుబడులు చేస్తున్న ట్రెండ్‌ ఇటీవలి కాలంలో పెరుగుతోంది. దీంతో కంపెనీలు పెద్ద ఎత్తున మహిళలను చేర్చుకుంటున్నాయి.

ప్రపంచంలో ఎక్కడి నుంచైనా..: గిగ్‌ విధానం ఇప్పుడు కొత్తగా ట్రెండ్‌ అవుతోంది. ఈ విధానంలో ఒప్పంద పద్ధతిలో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుందని ఐటీ రిక్రూటర్‌ రేచల్‌ స్టెల్లా రాజ్‌ తెలిపారు. ఇండిపెండెంట్‌ కాంట్రాక్టర్స్, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం వర్కర్స్, కాంట్రాక్ట్‌ వర్కర్స్, ఆన్‌ కాల్‌ వర్కర్స్, టెంపరరీ వర్కర్స్‌.. ఇలా విభిన్న పేర్లతో విధులు నిర్వర్తిస్తూ కంపెనీలకు, వారి క్లయింట్లకు అవసరమైన సేవలను వీరు అందిస్తారు.

ప్రపంచంలో ఎక్కడున్నా గిగ్‌ విధానంలో పని చేయవచ్చు. ఇది మహిళలకు.. ప్రధానంగా ఉద్యోగాలను మధ్యలో వదిలేసిన వారికి కలిసి వస్తోంది. చిన్న కంపెనీలు, స్టార్టప్స్‌ ఎక్కువగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. పీఎఫ్, బీమా వంటి వ్యయాలు లేకపోవడం వీటికి కలిసి వస్తుంది. పైగా తక్కువ ఖర్చుతో పనులను పూర్తి చేసుకోవచ్చు. నైట్‌ షిఫ్ట్‌ల కారణంగా ఉద్యోగాలు మానేసిన వారు ఇప్పుడు ఎటువంటి అడ్డంకి లేకుండా కెరీర్‌ను తిరిగి మలుచుకుంటున్నారు. రూ.లక్షకుపైగా ఆదాయం ఆర్జిస్తున్న వారూ ఉన్నారు.

షీ–అంబాసిడర్ల ద్వారా..
పలు కంపెనీల్లో ఉన్న ఉద్యోగావకాశాల వివరాలను మహిళలకు తెలియజేసేందుకు అంబాసిడర్లను నియమిస్తున్నాం. మార్చి నాటికి 50 కంపెనీల్లో వీరిని నియమించాలని లక్ష్యంగా చేసుకున్నాం. అంబాసిడర్ల ద్వారా వచ్చే ఉద్యోగ సమాచారాన్ని మా పోర్టల్‌లో పబ్లిష్‌ చేస్తాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా మహిళల కోసం అందుబాటులో ఉన్న ఉద్యోగ వివరాలను పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తున్నాం.

– ఈటె విజయ స్పందన, సీవోవో, షీ–జాబ్స్‌.కాం


డిమాండ్‌నుబట్టి వేతనం..
కంపెనీల అవసరాన్ని బట్టి వేతనాలు నిర్ణయమవుతున్నాయి. ఉద్యోగం మానేసినప్పటికీ అదనపు అర్హతలు సంపాదించిన వారు గతంలో కంటే ఎక్కువగా సాలరీని అందుకుంటున్నారు. వర్క్‌ ఫ్రం హోం విధానంతో మహిళలు ఊర్లకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. వీరి స్నేహితులు సైతం తిరిగి ఉద్యోగాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఆన్‌లైన్‌ కోర్సుల ద్వారా సులభంగా జాబ్‌ సాధిస్తున్నారు.

– నానాబాల లావణ్య కుమార్, కో–ఫౌండర్, స్మార్ట్‌స్టెప్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement