Women carriers
-
మహిళలూ.. మళ్లీ కెరీర్ ప్రారంభించండి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెళ్లి, పిల్లలు, బాధ్యతలు, ఆరోగ్యం.. కారణమేదైనా కావొచ్చు. ఉద్యోగాలను మధ్యలోనే వదిలేసిన మహిళలు ఎందరో. ఉన్నత చదువులు చదివి, పెద్ద సంస్థల్లో జాబ్ సంపాదించిన వారూ వీరిలో ఉన్నారు. ఇప్పుడు వీరికి మేమున్నామంటూ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. అవసరమైతే నైపుణ్య శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం విధానం పుణ్యమాని ఇప్పుడు జాబ్ మార్కెట్లో సమూల మార్పులొస్తున్నాయి. ఈ విధానాన్ని ఆసరాగా చేసుకుని గిగ్ మోడల్ సైతం పాపులర్ అవుతోంది. ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ ఉంటే చాలు.. ఎంచక్కా ఇంటి నుంచి పని చేస్తూ మహిళలు తమ కెరీర్‌ను తిరిగి ప్రారంభిస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాల ద్వారా.. ఐటీ, ఎఫ్ఎంసీజీ, రిటైల్, ఈ–కామర్స్, ఫైనాన్షియల్ రంగాల్లో ఉద్యోగాలు మానేసిన మహిళలను తిరిగి చేర్చుకోవడానికి ప్రత్యేక డ్రైవ్‌లను కంపెనీలు చేపడుతున్నాయి. మైక్రోసాఫ్ట్, క్యాప్‌జెమిని, టీసీఎస్, వర్చూసా, వీఎంవేర్, ఐహెచ్ఎస్ మార్కిట్, యూబీఎస్.. ఇలా ఎన్నో కంపెనీలు ముందుకొస్తున్నాయి. కంపెనీల సామాజిక బాధ్యతలో భాగంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో మహిళలకు అవసరమైన శిక్షణ ఇచ్చి మరీ విధుల్లోకి తీసుకుంటున్నాయి. కంపెనీల భవిష్యత్ ఆర్థిక పనితీరును అంచనా వేయడానికి ఎన్విరాన్మెంటల్, సోషియల్, కార్పొరేట్ గవర్నెర్స్‌ను పెట్టుబడి సంస్థలు పరిగణలోకి తీసుకుంటున్నాయి. కింది స్థాయి నుంచి బోర్డు వరకు మహిళల ప్రాతినిధ్యం ఉన్న కంపెనీల్లోనే పెట్టుబడులు చేస్తున్న ట్రెండ్ ఇటీవలి కాలంలో పెరుగుతోంది. దీంతో కంపెనీలు పెద్ద ఎత్తున మహిళలను చేర్చుకుంటున్నాయి. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా..: గిగ్ విధానం ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతోంది. ఈ విధానంలో ఒప్పంద పద్ధతిలో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటుందని ఐటీ రిక్రూటర్ రేచల్ స్టెల్లా రాజ్ తెలిపారు. ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్, ఆన్లైన్ ప్లాట్‌ఫాం వర్కర్స్, కాంట్రాక్ట్ వర్కర్స్, ఆన్ కాల్ వర్కర్స్, టెంపరరీ వర్కర్స్.. ఇలా విభిన్న పేర్లతో విధులు నిర్వర్తిస్తూ కంపెనీలకు, వారి క్లయింట్లకు అవసరమైన సేవలను వీరు అందిస్తారు. ప్రపంచంలో ఎక్కడున్నా గిగ్ విధానంలో పని చేయవచ్చు. ఇది మహిళలకు.. ప్రధానంగా ఉద్యోగాలను మధ్యలో వదిలేసిన వారికి కలిసి వస్తోంది. చిన్న కంపెనీలు, స్టార్టప్స్ ఎక్కువగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. పీఎఫ్, బీమా వంటి వ్యయాలు లేకపోవడం వీటికి కలిసి వస్తుంది. పైగా తక్కువ ఖర్చుతో పనులను పూర్తి చేసుకోవచ్చు. నైట్ షిఫ్ట్‌ల కారణంగా ఉద్యోగాలు మానేసిన వారు ఇప్పుడు ఎటువంటి అడ్డంకి లేకుండా కెరీర్‌ను తిరిగి మలుచుకుంటున్నారు. రూ.లక్షకుపైగా ఆదాయం ఆర్జిస్తున్న వారూ ఉన్నారు. షీ–అంబాసిడర్ల ద్వారా.. పలు కంపెనీల్లో ఉన్న ఉద్యోగావకాశాల వివరాలను మహిళలకు తెలియజేసేందుకు అంబాసిడర్లను నియమిస్తున్నాం. మార్చి నాటికి 50 కంపెనీల్లో వీరిని నియమించాలని లక్ష్యంగా చేసుకున్నాం. అంబాసిడర్ల ద్వారా వచ్చే ఉద్యోగ సమాచారాన్ని మా పోర్టల్‌లో పబ్లిష్ చేస్తాం. అలాగే ప్రపంచవ్యాప్తంగా మహిళల కోసం అందుబాటులో ఉన్న ఉద్యోగ వివరాలను పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తున్నాం. – ఈటె విజయ స్పందన, సీవోవో, షీ–జాబ్స్.కాం డిమాండ్‌నుబట్టి వేతనం.. కంపెనీల అవసరాన్ని బట్టి వేతనాలు నిర్ణయమవుతున్నాయి. ఉద్యోగం మానేసినప్పటికీ అదనపు అర్హతలు సంపాదించిన వారు గతంలో కంటే ఎక్కువగా సాలరీని అందుకుంటున్నారు. వర్క్ ఫ్రం హోం విధానంతో మహిళలు ఊర్లకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. వీరి స్నేహితులు సైతం తిరిగి ఉద్యోగాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఆన్లైన్ కోర్సుల ద్వారా సులభంగా జాబ్ సాధిస్తున్నారు. – నానాబాల లావణ్య కుమార్, కో–ఫౌండర్, స్మార్ట్‌స్టెప్స్ -
అతివలూ సమిధలే..!
మహిళలు.. పోకిరీలు, మృగాళ్లకే కాదు.. స్మగ్లర్లకూ టార్గెట్ అవుతున్నారు. వారికి రకరకాల ఆశలు చూపి క్యారియర్లుగా వినియోగిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల కన్ను మహిళలపై ఎక్కువగా ఉండదనే ఉద్దేశంతో ఈ పంథా అనుసరిస్తున్నట్లు అధికారుల అనుమానం. గడిచిన మూడు నెలల్లో ఈ తరహాలో బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ ఏడుగురు మహిళలు పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన గంగుల మల్లేశ్వరి బ్యాంకాక్ నుంచి 4.5 కేజీల బంగారు బిస్కెట్లతో వస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. * క్యారియర్లుగా వినియోగించుకుంటున్న స్మగ్లర్లు * కస్టమ్స్ అధికారులకూ అనుమానం రాకూడదనే.. * ఇటీవల 4.5 కేజీల పసిడితో చిక్కిన కడప మహిళ * శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా వ్యవహారం వారిని అనుమానించడం తక్కువే.. సాధారణంగా స్మగ్లర్లు అనగానే అందరి మదిలో మెదిలేది పురుషులే. దీనికి తోడు మహిళలూ.. అందునా నిండు గర్భిణి, చంకలో పసి పిల్లలతో వచ్చేవారిని అధికారులు అనుమానించడం తక్కువ. ఈ కారణంగా దుబాయ్ తదితర దేశాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలకు కమీషన్ ఆశ చూపుతున్న బడా స్మగ్లర్లు వారికి బంగారం, మాదకద్రవ్యాలు అప్పగిస్తున్నారు. డ్రగ్స్ మాట అటుంచితే.. పసిడి తీసుకువచ్చే ఉమెన్ క్యారియర్లను ఎక్కువగా ఆయా దేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనే గుర్తించి స్మగ్లర్లు వారికి ఇచ్చి పంపిస్తున్నారు. మాదకద్రవ్యాలను కడుపులో దాచి గర్భవతులుగా, చంటి బిడ్డలతో వస్తున్న వారికి బంగారం తదితరాలను అప్పగించి పంపిస్తున్నారు. డీఎఫ్‌ఎమ్‌డీల వద్దా బురిడీ.. వివిధ రూపాలు, పంథాల్లో బంగారం అక్రమంగా తీసుకొస్తున్న మహిళలకు విమానాశ్రయాల్లోని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ (డీఎఫ్ఎండీ)లు కూడా కొంత వరకు ‘సహకరిస్తున్నాయి’. ఏదైనా అక్రమ రవాణా విషయం కస్టమ్స్ అధికారులు గుర్తించాలంటే పక్కా సమాచారం, ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) నిఘాల కంటే డీఎఫ్‌ఎండీఏ ఎక్కువగా ఉపకరిస్తున్నాయి. క్యారియర్లు దాటుతున్న సమయంలో లోపల దాచి ఉంచిన మెటల్ కారణంగా డీఎఫ్ఎండీలు శబ్ధం చేస్తాయి. మహిళలు సాధారణంగానే కొంత వరకు నగలు ధరించి ఉంటారు. వీటి వల్లే శబ్ధం వచ్చి ఉంటుందని అధికారులు భావించే ఆస్కారం సైతం ఉంటుందనే బడా స్మగ్లర్లు మహిళల్ని వినియోగించుకుంటున్నారు. కీలక వ్యక్తులు చిక్కడం కష్టమే.. ఈ తరహాలో అక్రమ రవాణా చేస్తూ చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా ముఠా వెనుక ఉన్న సూత్రధారులను కనిపెట్టడం కష్టంగా మారుతోందని కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో వీరికి బంగారం అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో మాత్రం మహిళలకు చెప్పట్లేదు. కేవలం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక ఓ ప్రాంతంలో వేచి ఉండమనో, ఫలానా హోటల్/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు. ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్లి బంగారం తీసుకుని మహిళలకు కమీషన్ చెల్లిస్తున్నారు. ఈ కారణంగానే విమానాశ్రయాల్లో పట్టుబడుతున్న క్యారియర్ల కేసుల్లో పురోగతి ఉండట్లేదని వివరిస్తున్నారు. ముమ్మర కసరత్తు చేస్తున్న కస్టమ్స్.. బడా స్మగ్లర్లు మహిళలను అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారనే ఉద్దేశంతో ప్రతి మహిళను ఆపి తనిఖీ చేయడం సాధ్యం కాదు. అలా చేస్తే అమాయకులు సైతం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల అధికారులు మహిళా ప్రయాణికుల జాబితాను ముందే సేకరిస్తున్నారు. వారు విదేశాలకు ఎప్పుడు వెళ్లారు? ఆఖరుసారిగా ఎప్పుడు వచ్చారు? ఏ వీసాపై వెళ్లారు? వారి నేపథ్యం ఏమిటి? తదితరాలను ఆరా తీస్తున్నారు. కేవలం అనుమానాస్పదమైన వారిని మాత్రమే అదుపులోకి తీసుకుంటూ ఫలితాలు సాధిస్తున్నారు. ఉదాహరణలు ఎన్నో.. * ఇటీవల దుబాయ్ నుంచి ‘గర్భిణిగా’ వచ్చిన సౌత్ ఆఫ్రికా మహిళ మూసా తన కడుపులో 793 గ్రాముల కొకైన్‌తో చిక్కింది. * మూడు నెలల క్రితం సౌదీ నుంచి తన భర్త, ఏడాదిన్నర కుమారుడితో వచ్చిన మహిళ 1.75 కేజీల బంగారంతో పట్టుబడింది. * బ్యాంకాక్, దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారి నుంచి నాలుగు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. * సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల్ని తనిఖీ చేయగా 5.1 కేజీల బంగారంతో పట్టుబడ్డారు. * యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులుకు 1.3 కేజీల బంగారం దొరికింది.