అతివలూ సమిధలే..! | Carriers womens using with Smugglers | Sakshi
Sakshi News home page

అతివలూ సమిధలే..!

Published Mon, Nov 16 2015 2:34 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

అతివలూ సమిధలే..!

అతివలూ సమిధలే..!

మహిళలు.. పోకిరీలు, మృగాళ్లకే కాదు.. స్మగ్లర్లకూ టార్గెట్ అవుతున్నారు. వారికి రకరకాల ఆశలు చూపి క్యారియర్లుగా వినియోగిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల కన్ను మహిళలపై ఎక్కువగా ఉండదనే ఉద్దేశంతో ఈ పంథా అనుసరిస్తున్నట్లు అధికారుల అనుమానం. గడిచిన మూడు నెలల్లో ఈ తరహాలో బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ ఏడుగురు మహిళలు పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన గంగుల మల్లేశ్వరి బ్యాంకాక్ నుంచి 4.5 కేజీల బంగారు బిస్కెట్లతో వస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది.
 
* క్యారియర్లుగా వినియోగించుకుంటున్న స్మగ్లర్లు
* కస్టమ్స్ అధికారులకూ అనుమానం రాకూడదనే..
* ఇటీవల  4.5 కేజీల పసిడితో చిక్కిన కడప మహిళ
* శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా వ్యవహారం
 
వారిని అనుమానించడం తక్కువే..
 సాధారణంగా స్మగ్లర్లు అనగానే అందరి మదిలో మెదిలేది పురుషులే. దీనికి తోడు మహిళలూ.. అందునా నిండు గర్భిణి, చంకలో పసి పిల్లలతో వచ్చేవారిని అధికారులు అనుమానించడం తక్కువ. ఈ కారణంగా దుబాయ్ తదితర దేశాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలకు కమీషన్ ఆశ చూపుతున్న బడా స్మగ్లర్లు వారికి బంగారం, మాదకద్రవ్యాలు అప్పగిస్తున్నారు.

డ్రగ్స్ మాట అటుంచితే.. పసిడి తీసుకువచ్చే ఉమెన్ క్యారియర్లను ఎక్కువగా ఆయా దేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనే గుర్తించి స్మగ్లర్లు వారికి ఇచ్చి పంపిస్తున్నారు. మాదకద్రవ్యాలను కడుపులో దాచి గర్భవతులుగా, చంటి బిడ్డలతో వస్తున్న వారికి బంగారం తదితరాలను అప్పగించి పంపిస్తున్నారు.
 
డీఎఫ్‌ఎమ్‌డీల వద్దా బురిడీ..
వివిధ రూపాలు, పంథాల్లో బంగారం అక్రమంగా తీసుకొస్తున్న మహిళలకు విమానాశ్రయాల్లోని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ (డీఎఫ్‌ఎండీ)లు కూడా కొంత వరకు ‘సహకరిస్తున్నాయి’. ఏదైనా అక్రమ రవాణా విషయం కస్టమ్స్ అధికారులు గుర్తించాలంటే పక్కా సమాచారం, ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) నిఘాల కంటే డీఎఫ్‌ఎండీఏ ఎక్కువగా ఉపకరిస్తున్నాయి.

క్యారియర్లు దాటుతున్న సమయంలో లోపల దాచి ఉంచిన మెటల్ కారణంగా డీఎఫ్‌ఎండీలు శబ్ధం చేస్తాయి. మహిళలు సాధారణంగానే కొంత వరకు నగలు ధరించి ఉంటారు. వీటి వల్లే శబ్ధం వచ్చి ఉంటుందని అధికారులు భావించే ఆస్కారం సైతం ఉంటుందనే బడా స్మగ్లర్లు మహిళల్ని వినియోగించుకుంటున్నారు.
 
కీలక వ్యక్తులు చిక్కడం కష్టమే..
ఈ తరహాలో అక్రమ రవాణా చేస్తూ చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా ముఠా వెనుక ఉన్న సూత్రధారులను కనిపెట్టడం కష్టంగా మారుతోందని కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో వీరికి బంగారం అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో మాత్రం మహిళలకు చెప్పట్లేదు.

కేవలం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక ఓ ప్రాంతంలో వేచి ఉండమనో, ఫలానా హోటల్/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు. ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్లి బంగారం తీసుకుని మహిళలకు కమీషన్ చెల్లిస్తున్నారు. ఈ కారణంగానే విమానాశ్రయాల్లో పట్టుబడుతున్న క్యారియర్ల కేసుల్లో పురోగతి ఉండట్లేదని వివరిస్తున్నారు.
 
ముమ్మర కసరత్తు చేస్తున్న కస్టమ్స్..

బడా స్మగ్లర్లు మహిళలను అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారనే ఉద్దేశంతో ప్రతి మహిళను ఆపి తనిఖీ చేయడం సాధ్యం కాదు. అలా చేస్తే అమాయకులు సైతం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల అధికారులు మహిళా ప్రయాణికుల జాబితాను ముందే సేకరిస్తున్నారు. వారు విదేశాలకు ఎప్పుడు వెళ్లారు? ఆఖరుసారిగా ఎప్పుడు వచ్చారు? ఏ వీసాపై వెళ్లారు? వారి నేపథ్యం ఏమిటి? తదితరాలను ఆరా తీస్తున్నారు. కేవలం అనుమానాస్పదమైన వారిని మాత్రమే అదుపులోకి తీసుకుంటూ ఫలితాలు సాధిస్తున్నారు.
 
ఉదాహరణలు ఎన్నో..
* ఇటీవల దుబాయ్ నుంచి ‘గర్భిణిగా’ వచ్చిన సౌత్ ఆఫ్రికా మహిళ మూసా తన కడుపులో 793 గ్రాముల కొకైన్‌తో చిక్కింది.
* మూడు నెలల క్రితం సౌదీ నుంచి తన భర్త, ఏడాదిన్నర కుమారుడితో వచ్చిన మహిళ 1.75 కేజీల బంగారంతో పట్టుబడింది.
* బ్యాంకాక్, దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారి నుంచి నాలుగు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
* సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల్ని తనిఖీ చేయగా 5.1 కేజీల బంగారంతో పట్టుబడ్డారు.
* యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులుకు 1.3 కేజీల బంగారం దొరికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement