పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్న తరుణంలో వినియోగదారులు ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లవైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీవైపు మొగ్గు చూపుతున్నాయి. గత ఏడాది నుంచి ఎక్కువ శాతం మంది ప్రజలు ఈ ఎలక్ట్రిక్ వాహనాల గురుంచి మాట్లాడుకుంటున్నారు. దీంతో భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలపై ఆధారపడుతుందనే ఆలోచనతో పోటీ పడుతూ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. తాజాగా, ప్రముఖ జపాన్ కార్ల తయారీ సంస్థ టొయోటా మోటార్స్ కూడా తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టొయోటా బిజెడ్4ఎక్స్(Toyota bZ4X)ని ఆవిష్కరించింది.
ఇతర కంపెనీలకు పోటీ ఇచ్చే విధంగా ఇందులో ఫీచర్స్ ఉన్నాయి. 500 కిలోమీటర్ల రేంజ్‌తో టెస్లా, వోక్స్ వ్యాగన్, హ్యుందాయ్ వంటి ఇతర బ్రాండ్లను ఇది సవాలు చేయగలదు. టొయోటా బిజెడ్4ఎక్స్ ఉత్తర అమెరికా, చైనా, ఎంపిక చేసిన యూరోపియన్ మార్కెట్లలో 2022లో తీసుకొని రానున్నారు. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వాహనాల కోసం టొయోటా సిద్ధం చేస్తున్న బిజెడ్ సిరీస్‌లో బిజెడ్4ఎక్స్ కారు అనేది మొదటి మోడల్. 2025 నాటికి 'బిజెడ్' సిరీస్ మోడల్స్ తో సహ మొత్తం 15 ఎలక్ట్రిక్ వాహనలను లాంచ్ చేయాలని చూస్తుంది. టొయోటా బిజెడ్4ఎక్స్ పేరులో బిజెడ్ అంటే అర్థం 'బియాండ్ జీరో(జీరోకి మించి అని అర్థం)'.
బిజెడ్4ఎక్స్ డిసెంబర్ 2న ఐరోపాలో ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఈ కొత్త బిజెడ్4ఎక్స్ ఈవీలో 71.4 kWh బ్యాటరీ ప్యాక్ ఉపయోగించారు. ఈ బ్యాటరీ ప్యాక్ పూర్తి చార్జ్ పై ఫ్రంట్-వీల్-డ్రైవ్ వెర్షన్‌తో 500 కి.మీ రేంజ్, ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్‌తో దాదాపు 460 కి.మీ రేంజ్ వరకు వెళ్లనున్నట్లు టొయోటా పేర్కొంది.బిజెడ్4ఎక్స్ కారు ఫ్రంట్-వీల్-డ్రైవ్ వెర్షన్ కేవలం ఒకే 150కెడబ్ల్యు మోటార్ కలిగి ఉంటుంది. కాగా, ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్ bZ4X మోడల్ లో ప్రతి యాక్సిల్ పై చేయబడిన 80 కెడబ్ల్యు మోటార్ అమర్చబడి ఉంటుంది. ఈ టొయోటా ఎలక్ట్రిక్ కారు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అవుట్‌పుట్ ఛార్జర్ లకు కూడా అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
150కెడబ్ల్యు డీసీ ఛార్జర్ సహాయంతో బ్యాటరీలను 30 నిమిషాల్లో 80% వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు అని టొయోటా పేర్కొంది. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా పార్క్ చేసేటప్పుడు ఛార్జింగ్ కోసం సోలార్ ప్యానెల్స్ ని పైకప్పులో నిర్మించవచ్చు. 4.69 మీటర్ల పొడవు, 1.65 మీ ఎత్తు, 1.86 మీ వెడల్పుతో బిజెడ్4ఎక్స్ హ్యుందాయ్ అయోనిక్ పరిమాణంలో ఉంటుంది. మన ఇండియాలో ఎప్పుడూ ఎలక్ట్రిక్ కారు తీసుకొని వస్తారు అనే విషయంలో స్పస్టత లేదు.
Comments
Please login to add a commentAdd a comment