ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ హంగులు సమకూర్చి అంతర్జాతీయ ప్రమాణాలను కల్పిస్తోంది. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ విద్యారంగంలో పూర్తిస్థాయి సంస్కరణలకు నాంది పలికిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టిస్తోంది. ఇందులో భాగంగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ (ఐఎఫ్‌పీ)లు, స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు సరికొత్త విద్యా బోధనలు అందుబాటులోకి తెస్తోంది. ఇందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
పుత్తూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు సైతం ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్జానాన్ని అందిపుచ్చుకొనేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం డిజిటల్ హంగులు సమకూరుస్తోంది. బ్లాక్ బోర్డుపై చాక్‌పీస్‌తో రాస్తూ పాఠ్యాంశాలు బోధించే పద్ధతి కనుమరుగు కానుంది. రానున్న రోజుల్లో పూర్తిగా డిజిటల్ పద్ధతుల్లో బోధన కొనసాగనుంది. ఇందుకు అనుగుణంగా హైస్కూల్స్‌లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ద్వారా, ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీల ద్వారా బోధన చేస్తారు. వాటికి ఇంటర్నెట్‌ను అనుసంధానం చేయనున్నారు. అలాగే బైజూస్ కంటెంట్‌తో పాఠాలు బోధిస్తారు. తద్వారా పాఠ్యాంశాలు అనేక ఉదాహరణలతో విస్తృతమైన రూపకల్పనలతో విద్యార్థులకు సులభంగా అర్థమైయ్యేలా బోధనలు ఉంటాయి. ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సైతం పోటీపడే అవకాశం ఏర్పడుతుంది.
యుద్ధప్రాతిపదికన పరికరాల ఏర్పాట్లు
చిత్తూరు జిల్లాలో ఇప్పటికే ఎంపికై న పాఠశాలలకు ఐఎఫ్‌పీ, స్మార్ టీవీలు, ఇతర సాంకేతిక ఉపకరణాలు చేరాయి. ఇకపై తరగతి గదుల్లో ఆధునిక పద్ధతుల్లో విద్యా బోధనలు ప్రారంభం కా నున్నాయి. జిల్లాలో తొలి విడతగా 418 పాఠశాలను ఎంపిక చేయగా, ఇందులో 160 హైస్కూల్స్‌లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్‌పీ)లు, 258 ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఉపకరణాలు ఆయా పాఠశాలలకు చేరాయి. వాటికి అవసరమైన ఇతర పరికరాలను సైతం యుద్ధ ప్రాతిపదికన పాఠశాలలకు చేర్చేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ
డిజిటల్ పరికరాల వినియోగంపై తొలి విడత శిక్షణకు జిల్లాలో 5,971 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన కళాశాలల్లో, పాఠశాలల్లో 40 మందిని ఒక బ్యాచ్‌గా ఏర్పాటు చేసి రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇందులో 4,993 మంది తరగతులకు హాజరై శిక్షణ పొందారు.
ఇక అర్థవంతంగా బోధన
విద్యార్థులకు సులభతరంగా పాఠాలు అర్థమైయ్యేందుకు డిజిటల్ బోధనలు ఎంతగానో దోహదపడుతాయి. పాఠశాలల్లో వీటి వినియోగం గొప్ప మార్పుకు సంకేతం. తొలి విడతలో ఎంపికై న పాఠశాలలకు డిజిటల్ ఉపకరణాలు చేరాయి. ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు పూర్తయ్యాయి. ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో తీసుకొస్తున్న ఈ మార్పుతో మంచి ఫలితాలు వస్తాయని ఘంటాపథంగా చెప్పగలం.
– సి.విజయేంద్రరావు,డీఈఓ, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment