
ఎస్వీయూ ఆడిటోరియంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి హాజరైన వలంటీర్లు
● రాష్ట్రం గర్వపడేలా వలంటీర్ వ్యవస్థ ● సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లు ● తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ● చంద్రగిరి నియోజకవర్గంలోని 2,137 మంది వలంటీర్లకు ఘన సత్కారం
తిరుపతి రూరల్: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తున్న వలంటీర్ల సేవలు మరువలేమని తుడా చైర్మన్, వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తెలిపారు.ఆదివారం తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో వలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 2,137 మంది వలంటీర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి తమ సొంత నిధులతో ప్రతి వలంటీరుకు రెండు వస్తువులతో కూడిన బహుమతులను అందించారు. అనంతరం మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ సుపరిపాలన అంటే నేరుగా ప్రజలకు సేవ చేయడమనే గుర్తించి, అవినీతికి తావులేని వలంటీర్ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారని వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి వేలాది మందిని పొట్టన పెట్టుకున్న విపత్కర పరిస్థితుల్లోనూ ప్రా ణాలను సైతం ఫణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించిన జగనన్న సైన్యానికి సెల్యూట్ అని చెప్పారు. వలంటీర్లను చూసి రాష్ట్రం గర్విస్తోందన్నారు. ఈ వ్యవస్థకు ఇతర రాష్ట్రాల్లో సైతం ప్రశంసలు వస్తున్నాయని, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అమలు చేయడం తథ్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దగ్గర నుంచి పరిశీలిస్తోంది, పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు అందిస్తోంది వలంటీర్లే అని వివరించారు. ప్రభుత్వంపై ఎవరు నిందలు వేసినా నిజాలు చెప్పగలిగిన సత్యసారథులు వలంటీర్లే అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మీరే బ్రాండ్ అంబాసిడర్లని, మీరే ఆత్మీయ బంధువులని తెలిపారు. వేకువజామునే సామాజిక పింఛన్లు అందిస్తున్న సమాజ సేవకులు వలంటీర్లు అని ప్రశంసించారు. నాలుగేళ్లలో ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే రూ.2,187 కోట్ల విలువైన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందించడంలో వలంటీర్ల పాత్ర కీలకమని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment