● హంద్రీ–నీవా ప్రాజెక్టుకు రూ.3,500 కోట్లు కేటాయించాలని
పెద్దతిప్పసముద్రంలో పుంగనూరు ఉపకాలువకు లైనింగ్ పనులు
బి.కొత్తకోట : హంద్రీ–నీవా ప్రాజెక్టులోని ప్రధాన కాలువ, ఉప కాలువలు, రిజర్వాయర్లకు కృష్ణా జలాలు చేరాలంటే 2025–26 బడ్జెట్‌లో ఉదారంగా నిధులు కేటాయించాలి. ఈ మేరకు కూటమి ప్రభుత్వం పుష్కలంగా నిధులు కేటాయిస్తుందా లేక వైఎస్సార్‌సీపీ హయాంలో మంజూరు చేసిన నిధులనే పేర్కొని చేతులు దులుపు కుంటుందా అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రాజెక్టును పూర్తి చేసి పొలాలకు కృష్ణా జలాలు అందిస్తారనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. అయితే గత టీడీపీ ప్రభుత్వంలో ఏనాడూ అవసరమైనంత నిధులను బడ్జెట్‌లో కేటాయించలేదు. దీంతో పనులు ముందుకు సాగలేదు. వైఎస్సార్‌సీపీ హయాంలో చేపట్టిన అదనపు పనులను కూటమి ప్రభుత్వం కక్షగట్టి రద్దు చేసేసింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు నిధులుఇస్తారా అని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రతిపాదనలు పంపారు సరే..
హంద్రీ–నీవా ప్రాజెక్టు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ ఉమ్మడి జిల్లాల్లో సాగుతుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న, చేపట్టబోయే పనులకు రూ.3,500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి బడ్జెట్ ప్రతిపాదనలను ఉన్నతాధికారులు పంపారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కాలువ వెడల్పు, కాంక్రీటు, మట్టి పనులను రూ.1,240 కోట్లతో చేపట్టారు. ఇవి కాక ప్రధాన కాలువకు సంబంధించి మరో రూ.503 కోట్లతో పనులు సిద్ధం చేశారు. ఈ మొత్తం పనులకే రూ.1,700 కోట్లు కావాలని నివేదించారు. ఇవి కాక కర్నూలు జిల్లాకు రూ.450 కోట్లు పోను, మిగిలిన రూ.1,350 కోట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనులను చేపట్టాల్సి ఉంటుంది.
ఆమోదం వచ్చేనా..?
లైనింగ్‌కే రూ.684 కోట్లు
పుంగనూరు ఉపకాలువ వెడల్పు పనులను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం కాలువ లైనింగ్ పనులకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలం నుంచి చిత్తూరు జిల్లాలోని పెద్దపంజాణి మండలం వరకు పుంగనూరు ఉపకాలువకు లైనింగ్ పనులను రూ.480 కోట్లతో, పెద్దపంజాణి నుంచి కుప్పం వరకు కుప్పం ఉపకాలువకు రూ.204 కోట్లతో లైనింగ్ పనులను చేపట్టారు. ఇది కాక కుప్పం కాలువకు సంబంధించి ఇంకా రూ.59 కోట్ల పనులు జరగాల్సి ఉంది. ప్రభుత్వం చెబుతున్నట్టు ఆరునెలల్లో ఈ లైనింగ్ పనులు పూర్తి కావాలంటే బడ్జెట్‌లో అందుకు తగ్గట్టు నిధులు కేటాయించాలి. కాగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుప్పానికి రూ.535 కోట్లతో యామిగానిపల్లె వద్ద 0.7 టీఎంసీలు, మాదనపల్లె వద్ద 0.3 టీఎంసీలతో రిజర్వాయర్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. వీటిని సద్వినియోగం చేసుకుని బడ్జెట్‌లో అనుమతి ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.
విభజిత అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ప్రాజెక్టు పనులు పూర్తి కావడానికి ఇంచుమించు రూ.2 వేల కోట్లు అవసరమవుతాయి. అలాగే అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు రూ.729 కోట్లు కేటాయించాలని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈ నిధుల్లో రూ.250 కోట్లతో ప్రధానకాలువపై చిన్నమండెం మండలం పడమటికోన, కలకడ వద్ద కాలువ తవ్వకం, 12 చోట్ల కాంక్రీటు నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి పూర్తి చేస్తే కానీ అడవిపల్లె, శ్రీనివాసపురం రిజర్వాయర్లకు కృష్ణా జలాలు వెళ్లవు. ఈ రూ.250 కోట్లకు ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చేనా అని రైతులు ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment