కక్షగట్టి వేధింపులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి పనిచేశానని కక్షగట్టి వేధిస్తున్నారని, దౌర్జన్యంగా మా షాపులకు తాళం వేశారని బాధితులు ఇమ్రాన్, సుమియా దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. 2021లో చిత్తూరు వన్ డిపో పరిధిలోని ఓ ఖాళీ స్థలానికి టెండర్ దక్కించుకుని సొంత ఖర్చులతో షాపులు కట్టుకున్నామన్నారు. నిబంధనల ప్రకారం ముందస్తు డిపాజిట్ కింద రూ. 3లక్షల వరకు చెల్లించామని వెల్లడించారు. ఆ షాపుల మీదే ఆధారపడి కుటుంబీకులను పోషించుకుంటున్నామని చెప్పారు. అయితే నాలుగు నెలలుగా షాపు ఖాళీ చేయాలని ఆర్టీసీ డీపీటీఓ జగదీష్ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. టెండర్ ప్రకారం 14 నెలల కాల పరిమితి ఉన్నప్పటికీ దుకాణానికి తాళం కూడా వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నిస్తే కూటమి పార్టీలకు చెందిన గోకుల్ తమ ఒత్తిడి తెస్తున్నారని డీపీటీఓ చెప్పారని మండిపడ్డారు. దీనిపై హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. తాము చెల్లించిన డిపాజిట్ డబ్బులను కూడా తిరిగి ఇచ్చేది లేదని బెదిరిస్తున్నారని వెల్లడించారు. షాపుల నిర్మాణానికి రూ.25లక్షలు వెచ్చించామని, ఇప్పుడు ఖాళీ చేసి వెళ్లమనడం దారుణమని వివరించారు. ఉన్నతాధికారులు స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment