సమస్యలు.. వెల్లువెత్తిన వినతులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సోమవారం కలెక్టరేట్‌కు వివిధ సమస్యలతో ప్రజలు తరలివచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా అర్జీలు అందించారు. ఈ మేరకు కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ, జేసీ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ హిమవంశీ, డీఆర్‌ఓ మోహన్‌కుమార్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ అధికారులు మాట్లాడుతూ వివిధ సమస్యలపై మొత్తం 248 అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు.
‘గేటు’ వసూలుపై ఆవేదన
నగరి మున్సిపాలిటీ పరిధిలో గేటు రుసుము కింద రోజూ రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ పట్టణంలో దాదాపు 400 మంది ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆటో డ్రైవర్ల నుంచి ప్రతి రోజు రూ.30 వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి గేటు వసూలు లేదన్నారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.
మెయిన్ సెంటర్లుగా మార్చండి
జిల్లాలోని అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్ఫర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు, యూనియన్ జిల్లా కార్యదర్శి షకీలా డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదన్నారు. 2019 నుంచి నేటి వరకు అంగన్‌వాడీ కార్మికుల జీతాలు పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సంఘ నాయకులు సుజిని, మమత పాల్గొన్నారు.
బస్‌షెల్టర్ నిర్మాణం కోసం..
బస్‌షెల్టర్ నిర్మించాలని ఐరాల మండలం పొలకల గ్రామం అగ్రహారంపల్లె దళితవాడ వాసులు విన్నవించారు. వారు మాట్లాడుతూ తమ గ్రామంలో బస్‌షెల్టర్ లేకపోవడంతో విద్యార్థులు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం బస్‌షెల్టర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు.
కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు 248 అర్జీలు
సమస్యలు.. వెల్లువెత్తిన వినతులు
సమస్యలు.. వెల్లువెత్తిన వినతులు
Comments
Please login to add a commentAdd a comment