చిన్నారి బలి
మృగాళ్ల మాయమాటలకు
● తెలిిసీ తెలియని వయసులో మోసపోయిన బాలిక ● ఇందుకు సహకరించిన ఇద్దరు మహిళలు ● ఆధారాల సేకరించిన వైనం ● పోలీసుల అదుపులో నిందితులు
పలమనేరు : తెలిసీ తెలియని వయసులో మృగాళ్ల దాహానికి పదో తరగతి చదువుతున్న బాలిక సోమవారం తనువు చాలించిన విషాదకర ఘటన తెలిసిందే. పేదరికం కారణంగా ఆ బాలిక తల్లిదండ్రులు పొద్దున కూలిపనులకెళితే ఎప్పుడో రాత్రికి గాని ఇంటికి రారు. దీంతో పిల్లలను చూసుకోవాల్సిన సమయం దొరకలేదు. స్కూల్ వదిలాక, సెలవు రోజుల్లో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మైనర్ బాలిక అదే గ్రామానికి చెందిన ఇరువురు మిహిళలతో కాస్త చనువుగా ఉండడమే ఈ ఘాతుకానికి కారణమైందనే సమాచారం ఇప్పుడు పలమనేరు మండలం అంతా చర్చ సాగుతోంది.
ఇద్దరు మాయలేడిల మత్తులో..
పలమనేరు మండలంలోని బాలిక గ్రామానికే చెందిన ఇద్దరు మహిళలు పశువులు మేపుకొనే వారు తరచూ మైనర్ బాలిక ఇంటికి వచ్చి చనువుగా ఉంటున్నట్లు తెలిసింది. దీంతో వారు ఆ కుటుంబంలోని పదో తరగతి చదువుతున్న బాలిక, ఏడో తరగతి చదివే ఆమె తమ్ముడు, గ్రామంలో రెండో క్లాస్ చదివే మరో చెల్లితో స్నేహంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ ఇరువురు యువతులకు అదే గ్రామానికి చెందిన తాపీ పనులు చేసే మంజు, నవీన్, మల్లికార్జున బాగా పరిచయస్తులు. ఈ యువతుల ద్వారా మైనర్ బాలికపై వీరు కన్నేసినట్లు తెలుస్తోంది. అభం శుభం ఎరుగని మైనర్ బాలికలు గత ఏడాదిగా వీరికి బిరియాని, తినుబండారాలు ఇస్తూ లోబరుచుకున్నట్లు బాధితురాలి సోదరి తెలిపింది. ఏదేమైనా ఇరువురు కిలాడీ లేడీల సాయంతోనే మృగాళ్లు మైనర్ బాలికను వశం చేసుకున్నట్లు గ్రామంలో అందరి నోటా వినిపిస్తోంది.
గతంలో కేసులు నీరుగార్చినందుకే..అనుమానాలు
గతంలోనూ మైనర్ బాలికలను గర్భిణులను చేసిన రెండు సంఘటనలు ఈ గ్రామంలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం జరగలేదనే మాట ఇప్పుడు సంచలనమైంది. ఈ కేసుల్లోని నిందితులు రాజీ మార్గాలు, రాజకీయ నేతల ద్వారా దర్జాగా తప్పించుకున్నట్లు తెలిసింది. దీంతో ఎవరిని అత్యాచారం చేసినా ఎలాగైనా తప్పించుకోవచ్చుననే భావన యువకుల్లో నెలకొంది. ఈ కారణంగానే ఇప్పుడు పదో తరగతి బాలిక మృతికి కారణమైందనే మాట గ్రామంలో అందరినోట వినిపిస్తోంది. ఇలాంటి కేసుల్లో అసలు నిందితులను వదిలి పెట్టడంతోనే ఇలాంటి దురాఘతాలకు పదే పదే జరుగుతున్నా యని గ్రామస్తులు ఆరోపిస్తుండడం విశేషం.
అదుపులో నిందితులు...
మైనర్ బాలికను గర్భం చేసి ఆమె మృతికి కారణమైన ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పలువురు యువకులు, ఇరువురు మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. రేపోమాపో ఈ కేసుకు సంబంధించి అసలు నిందితులను పోలీసులు పట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎస్పీ మణికంట చందోలు ఆదేశాల మేరకు స్థానిక డీఎస్పీ డేగల ప్రభాకర్, సీఐ నరసింహరాజు ఈ కేసులో నిందితులను కోర్టు ముందు ఉంచేందుకు సిద్ధం అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment