అయ్యో బిడ్డా.. ఎంత ఘోరం
● బాలిక అంత్యక్రియలు ● సాయం చేసిన దాతలు ● ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదన్న మాజీ ఎమ్మెల్యే
పలమనేరు : కామాంధుడి దాహానికి బలై తొమ్మిది నెలలు కడుపులో బిడ్డను మోసి తనువు చాలించిన బాలిక అంత్యక్రియలు మండలంలోని ఓ గ్రామంలో మంగళవారం అశ్రునయనాల మధ్య నిర్వహించారు. గ్రామస్థులు, బంధువుల రోదనల మధ్య ఆఖరి తంతు పూర్తి చేశారు. ఇలాంటి ఘోరం ఇంకే ఆడపిల్లకు జరగరాదంటూ కుటుంబికులు ఆక్రోశం వెల్లగక్కారు. పేద కుటుంబం కావడంతో గ్రామానికి చెందిన మునస్వామి, వైఎస్సార్‌సీపీ నేతలు బాలాజీనాయుడుతో కలసి అంత్యక్రియల కోసం రూ.5 వేల ఆర్థికసాయం అందజేశారు. బాలిక చదువుతున్న పాఠశాల తోటి పిల్లలు, ఉపాధ్యాయ బృందం కొంత సాయాన్ని అందించారు. దీంతో బాలిక అంత్యక్రియలు జరిగాయి. పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు బాలిక మృతదేహానికి నివాళి అర్పించి కుటుంబానికి ధైర్యం చెప్పారు.
ఇలాంటివి పునరావృతం కారాదు...
ఈ సంఽఘటనపై స్పందించిన పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ తన ప్రగాఢసానుభూతిని తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల రోజూ ఏదో ఓచోట ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనలు జరిగినప్పుడు పోలీసులు ఫొక్సో కేసులను నమోదు చేసి ఆపై చేతులు దులుపుకోవడం షరామామూలైందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. ఇలాంటి సంఘటనల కోసమే గత ప్రభుత్వంలో దిశా చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమైయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు, ఐద్వా, కమ్యూనిస్ట్ నేతలు, ప్రజా, మహిళా సంఘాలు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
విషాదఛాయలు
మైనర్ బాలిక మృతి, ఆస్పత్రిలో శిశువు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంపై గ్రామంలో ఏ ఇంట్లో చూసినా విషాదం అలుముకుంది. కూలీనాలికెళ్లే తమలాంటి కుటుంబాల్లో బడి కెళ్లే ఆడ పిల్లలను ఎల్లవేలలా చూసుకొనే పరిస్థితి ఉండదని వాపోతున్నారు. ఏదేమైనా గ్రామంలో ఏ నోట విన్నా అయ్యో బిడ్డా ఇలా అయిందనే మాట వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment