డీల్‌ కుదిరితే.. | - | Sakshi
Sakshi News home page

డీల్‌ కుదిరితే..

Published Thu, Feb 20 2025 9:00 AM | Last Updated on Thu, Feb 20 2025 8:55 AM

డీల్‌

డీల్‌ కుదిరితే..

పల్లెల్లో నిరంతరాయంగా త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేయాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం ఘనంగా ఉన్నా క్షేత్ర స్థాయిలో చతికిలపడుతోంది. జూన్‌ నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యం మేడి పండు చందంగా మారింది. గుత్తేదారులు పనులు చేసేందుకు వెళుతున్నా..కమీషన్‌లు ఇవ్వందే పనులు ముందుకు సాగనివ్వమని స్థానిక కూటమి నేతలు భయపెడుతున్నారు. దీంతో డీల్‌ కుదుర్చుకుంటేనే పనులు సాగనిస్తున్నారు. ఫలితంగా పనులు నత్తతో పోటీపడుతూ పల్లె ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా మరో కొన్ని నెలలు అందుబాటులోకి వచ్చే పరిస్థితి కానరావడం లేదు.

జిల్లా సమాచారం

మొత్తం రూరల్‌ ఫీడర్లు 420

9.1 మీటర్ల పోల్స్‌ పెట్టాల్సినవి 74,000

ఇప్పటి వరకు ఏర్పాటు చేసినవి 16,800

8 మీటర్ల పోల్స్‌ పాతాల్సినవి 15,000

ఇప్పటి వరకు పెట్టినవి 5,200

ట్రాన్స్‌ఫార్మర్ల లక్ష్యం 1000

క్షేత్రస్థాయిలో ఏర్పాటు 40

మొత్తం ప్రాజెక్టు విలువ రూ.700 కోట్లు

ఇప్పటి వరకు చేసిన వ్యయం రూ.74 కోట్లు

చిత్తూరు కార్పొరేషన్‌ : ప్రతి పల్లెకు త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా ఇవ్వాలని 2023లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలో రూ.700 కోట్లతో ఆర్‌డీఎస్‌ఎస్‌ (రీవాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌) పథకాన్ని ప్రవేశపెట్టారు. పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమై వేగం పుంజుకుంటున్న సమయంలో ఎన్నికల కోడ్‌తో పనులు నిలిచిపోయాయి. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది జూన్‌ నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యం ఉండగా ఇప్పటి వరకు దాదాపు 10 శాతం నిధులు ఖర్చు చేయగా 25 శాతం పనులు మాత్రమే జరిగాయి.

ప్రతిసారి అభివృద్ధికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా చెప్పుకునే టీడీపీ కాంట్రాక్టర్లను మార్పు చేయాలని చూశారు. కుదరకపోవడంతో తమకు కమీషన్‌ డబ్బులు చెల్లించకుండా పనులు చేయడానికి వీల్లేదని అభివృద్ధికి అడ్డుపడ్డారు. చిత్తూరు, పూతలపట్టులో దాదాపు డీల్‌ కుదిరినట్లు సమాచారం. ఇక పుంగనూరులో టీడీపీ నేతతో బేరాలు చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో మధ్యే మార్గంగా వెళుతున్నారు. దీంతో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. అసలే బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఏడుస్తుంటే కూటమి నాయకుల వేధింపులతో అల్లాడుతున్నారు. పనులు వేగం పెంచి నిర్ణీత గడువు పెంచడానికి అనుమతి కోరాలనేది వారి ఉద్దేశ్యం. కానీ క్షేత్రస్థాయిలో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది.

మెరుగైన సరఫరా కోసం

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని 420 ఫీడర్లలో పనులు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు పలు దశల్లో 123 ఫీడర్ల పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా లో ఓల్టేజీ సమస్య పరిష్కరించి మెరుగైన విద్యుత్‌ సరఫరా ఇవ్వాలని పెట్టుకున్న లక్ష్యం నీరుగారుతోంది. కేంద్రం 60 శాతం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ పరంగా పనులు చేయాలని నిర్దేశించారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక ఫీడర్లతో విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేయనున్నారు.

నత్తనడకన ఆర్‌డీఎస్‌ పనులు

అభివృద్ధికి కూటమి నేతల ఆటంకం

గ్రామాలకు త్రీఫేజ్‌ విద్యుత్‌ ఇవ్వాలని లక్ష్యం

జిల్లాలో రూ.700 కోట్లతో పనులు

25 శాతమే పనులు జరిగిన వైనం

జూన్‌ నాటికి ముగియనున్న గడువు

అధికార పార్టీ నేతల దందా

సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ లైన్ల స్థానంలో..

గ్రామాల్లోని నివాసాలు, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు త్రీఫేజ్‌ ఇవ్వాలనేది ఆర్‌డీఎస్‌ పథకం లక్ష్యం. గ్రామాలకు ఇప్పటి వరకు సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ లైన్లు ఉన్నాయి. ఫలితంగా పరిమిత వ్యవధిలో మంచినీటి సరఫరా సాగుతోంది. చాలా గ్రామాలు ఏళ్ల తరబడి లోఓల్టేజీ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇంత వరకూ జిల్లా, మండల కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా అవుతోంది. ఈ కారణాలతోనే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పట్టణాలు, నగరాలకు వెళ్లి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. పల్లెలో విరివిగా స్థలాలున్నప్పటికీ పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్యలను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆర్‌డీఎస్‌ఎస్‌ పనులు ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
డీల్‌ కుదిరితే..1
1/3

డీల్‌ కుదిరితే..

డీల్‌ కుదిరితే..2
2/3

డీల్‌ కుదిరితే..

డీల్‌ కుదిరితే..3
3/3

డీల్‌ కుదిరితే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement