పార్టీకో నిబంధన..
● కూటమి నేతలకు అధికారుల మద్దతు
● ముడిపల్లికు ఒక నియమం..
కాకవేడుకు మరొకటి
● కనుమరుగు కానున్న కాలువలు, గట్లు
నగరి : పార్టీలను అనుసరించి రెవెన్యూ అధికారుల నిబంధనలు మారుస్తుండడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైతుల అధీనంలో ఉన్న కాలువ పొరంబోకు అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. కాలువ పొరంబోకు అధీనంలో ఉన్న నేతలు కూటమి పార్టీకి చెందినవారైతే ఒక నిబంధన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైతే మరొక నిబంధన అన్న చందంగా పార్టీలను అనుసరించి ఇక్కడ నిబంధనలు మారిపోతున్నాయి. అధికార పార్టీ నేతలు లిఖించిన నిబంధనలే ఇక్కడ అమలవుతున్నాయి. దీనికి మండలంలోని ముడిపల్లి, కాకవేడు ప్రాంతాల్లో కాలువ పొరంబోకుల విషయంలో అధికారుల వ్యవహార శైలి ఇందుకు అద్దం పడుతోంది. కాకవేడు ప్రాంతంలో 40 ఏళ్లుగా వైఎస్సార్‌సీపీ నేతల స్వాధీనంలోని కాలువ పొరంబోకును అధికారులు స్వాధీనం చేసుకొని ఓ టీడీపీ నేత పొలానికి వెళ్లేందుకు రోడ్డుకు వీలు కల్పించారు. చెరుకు పంట సాగులో ఉన్నా లెక్కచేయక మట్టి తోలి రోడ్డు వేశారు. అడిగితే కాలువ పొరంబోకు ఆక్రమించుకోకూడదన్న సమాధానం అధికారుల నుంచి వచ్చింది. అయితే ఇదే నిబంధన ముడిపల్లి పంచాయతీలోని వెంగన్న కండ్రిగకు వెళ్లేసరికి మారిపోయింది. 2022 సంవత్సరంలో టీడీపీ నేతల అధీనంలో ఉన్న కాలువ, కాలువ పొరంబోకును స్వాధీనం చేసుకొని వెంగన్న కండ్రిగ ఎస్టీ కాలనీకి చెందిన 70 కుటుంబాల వారికి శ్మశానానికి దారి వసతి కల్పించారు. దీంతోపాటు, కొండపై నుంచి జాలువారే నీరు చెరువుకు త్వరగా చేరేలా పునరుద్ధరించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 70 కుటుంబాల అవసరాలను వదిలేసి మళ్లీ టీడీపీ నేతలకే అప్పగించింది. ముడిపల్లిలో కాలువ పొరంబోకును స్వాధీనంలో ఉంచుకున్న రైతులకే అప్పగించడం, కాకవేడులో స్వాధీనంలో ఉంచుకున్న రైతుల నుంచి తీసి దారి ఏర్పాటు చేయడం అధికారుల ద్వంద వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది. దీనిపై వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు బుజ్జిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 కుటుంబాలకు ఉపయోగపడే ప్రాంతంలో కాలువ పొరంబోకులో వేసిన రోడ్డును టీడీపీ నేతలకే అప్పగించడం, ఒక టీడీపీ నేత కోసం వైఎస్సార్‌సీపీ నేతల అధీనంలో ఉన్న భూములు స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే రెడ్‌బుక్ రాజ్యాంగమే అమలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీలను అనుసరించి నిబంధనలు మార్చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో కలుగజేసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment