
కష్టం మీద ఆస్పత్రికి చేరుకున్న ఓ వృద్ధురాలు, నాన్నకు తోడుగా... బాలుడు
సదరంలో దివ్యాంగుల అగచాట్లు
కుటుంబ సభ్యుల అపసోపాలు
అర్హత ఉన్నా తప్పని పునఃపరిశీలన
అందుబాటులో లేని వీల్‌చైర్లు, స్ట్రెచర్లు
కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కరువు
ఓపీ నుంచి పరీక్ష వరకు పడరానిపాట్లు
సొంతంగా ఏ పని చేసుకోలేని వారు.. కొందరు పుట్టుకతో.. ఇంకొందరు అనారోగ్యం కారణంగా వైకల్యం బారిన పడినవారు. వీరంతా నిరుపేదలు.. ప్రభుత్వ సాయంతోనే నాలుగు ముద్దలు నోటికాడికి వెళుతున్న దివ్యాంగులు వీరు .. గత ప్రభుత్వాన్ని బూచిగా చూపి పింఛన్లలో కోత పెట్టాలని కూటమి నిర్ణయించింది. కానీ పునఃపరిశీలన పేరుతో సదరం కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో దివ్యాంగుల అగచాట్లు చూస్తే ఎవరికై నా గుండె తరుక్కుపోతుంది.. కానీ అధికారులు.. కూటమి ప్రభుత్వ పెద్దలు వీరిపై కనికరం చూపకుండా దివ్యాంగులను కన్నీళ్లు పెట్టిస్తున్న తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : కూటమి ప్రభుత్వం చేపట్టిన సదరం సర్టిఫికెట్‌ల పునఃపరిశీలన ప్రక్రియ దివ్యాంగులకు పిడుగుపాటుగా మారింది. సదరం క్యాంపులకు చేరుకునేందుకు దివ్యాంగులు పడరాని పాట్లు పడుతున్నారు. ఏళ్ల తరబడి మంచం పట్టిన వారిని ఆస్పత్రులకు తీసుకొచ్చేందుకు.. కుటుంబ సభ్యులు అష్టకష్టాలు పడుతున్నారు. లేవలేని స్థితిలో కొందరు.. ఎక్కడికి వచ్చామో తెలియని అయోమయ పరిస్థితిలో మరికొందరు.. గంటల తరబడి నిరీక్షించలేక నీరసించి సొమ్మసిల్లి పడిపోయిన వారు కొందరు.. ఊతకర్ర సాయంతో చేరుకున్న వారు ఇంకొందరితో చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వేదికగా మారింది.
కనీస సౌకర్యాలు కల్పించక
సదరం క్యాంపునకు వచ్చే వారికి కనీస సౌకర్యాలను కల్పించడంలో అధికారుల తీరు ఏ మాత్రం మారడంలేదు. ఫలితంగా దివ్యాంగులకు చక్రాల కుర్చీలు దొరకడం గగనమవుతోంది. వీటిని కొంత మంది సిబ్బంది గదుల్లో ఉంచి అవసరమైన సమయాల్లో ఇతర పనులకు వినియోగిస్తున్నారు. సదరం క్యాంపులో రీ వెరిఫికేషన్ నిమిత్తం వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇవి ఎక్కడున్నాయో ఎవరికీ తెలియడంలేదు. సదరం పరిశీలనకు వచ్చే వారితో ఓపీ విభాగం నిండిపోతోంది. భారీ సంఖ్యలో ఓపీకి రావడంతో ఆ విభాగంలో బాధితులు బారులు తీరుతున్నారు. ఇద్దరు మాత్రమే ఓపీ సేవల్లో పాలుపంచుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు.
ప్రభుత్వం తీరుపై మండిపాటు...
అధికారంలోకి వస్తే అందరికీ మంచి చేస్తాం. సంక్షేమ పథకాలు అందిస్తాం.. స్వర్ణయుగం లాంటి పాలన అందిస్తామంటూ కూటమి నేతలు ఎన్నికల సమయంలో నమ్మబలికారు. తీరా చూస్తే... అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సంక్షేమ పథకాలు అటకెక్కించిన సంగతి పక్కనపెడితే... దివ్యాంగత్వం పునః పరిశీలన పేరుతో దివ్యాంగులను అష్ట కష్టాలకు గురిచేయడం అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. ఆస్పత్రుల వద్ద నిరీక్షిస్తున్న దివ్యాంగులను చూసిన వారు అయ్యో అంటూ నిట్టూర్చారు. అవయవ లోపాలతో ఇబ్బందులు పడుతున్న వారిని మళ్లీ గుర్తుచేసి వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్న తీరును పలువురు తప్పుబట్టారు.
బోగస్‌పై తప్పుడు ప్రచారం
బోగస్ పింఛన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే జరిగిందని బూచిగా చూపిస్తోంది. ఇది పూర్తి అవాస్తమని వైద్యులు, పలువురు దివ్యాంగులు తిప్పికొడుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయం నుంచి జిల్లాలో సదరంలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఏ సమస్యలు లేకపోయినా సమస్యలు ఉన్నట్లు సదరం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ బోగస్ వ్యవహారం పుంజుకుంది. పింఛన్ నగదు పెరగడంతో సందరానికి ఎక్కడలేని డిమాండ్ పెరిగింది. 2014 తర్వాత వేల సంఖ్యలో సదరం సర్టిఫికెట్లు పుట్టుకొచ్చాయి. కొంత మంది డాక్టర్లు రూ.10 వేల నుంచి రూ. 15 వేలు తీసుకుని ఎలాంటి సమస్యలు లేని వారికి సదరం సర్దేశారు. దీంతో సదరం పింఛన్ల సంఖ్య జిల్లాలో భారీగా పెరిగింది. అంతే తప్ప ఈ వ్యవహారాన్ని కూటమి గత ప్రభుత్వంపై బురదచల్లాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భా గంగా పింఛన్ల కోతకు పదును పెడుతోంది. 60 నుంచి 70 శాతం వరకు పింఛన్లలో కోతలు పెట్టాలని ఆదేశాలున్నట్లు కొంత మంది అధికారులు చెబుతున్నారు.
రవాణా సదుపాయం కల్పించక..
ఇంటిలో మంచంపైనే ఉన్న ఎంతో మంది దివ్యాంగులు పునఃపరిశీలన కోసం ఆస్పత్రులకు వచ్చేందుకు నరకం చూశారు. వారి కోసం కనీసం రవాణా సదుపాయాలు కల్పించకపోవడంతో వ్యయ ప్రయాసల కోర్చి ఆస్పత్రులకు చేరుకున్నారు. 15 నుంచి 20 ఏళ్లుగా పింఛన్ అందుకున్నప్పటికీ మళ్లీ పునఃపరిశీలన దేనికో అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కదల్లేని, లేవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, మానసిక దివ్యాంగులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురావడానికి వారి బంధువులు అవస్థలు పడ్డారు. ఇక్కడికి రాకపోతే పింఛన్ తొలగిస్తారని మంచంపై ఉన్న వారిని సైతం ఆస్పత్రికి అతి కష్టం మీద తెచ్చామని పలువురు వాపోయారు.
పింఛన్లు కుదించాలని..
జిల్లా వ్యాప్తంగా 2,55,818 మంది సామాజిక పింఛన్‌దారులున్నారు. ఇందులో 35,277 మందికి సదరం గుర్తింపు కార్డులు ఉన్నాయి. వీరికి పునఃపరిశీలన పేరుతో కూటమి ప్రభుత్వం పింఛన్లల్లో కోతలు పెట్టేందుకు పూనుకుంది. గత ప్రభుత్వంలో బోగస్ జరిగిపోయిందని కూటమి తప్పుడు ప్రచారం చేయించి పింఛన్ల తొలగింపునకు సిద్ధమైంది. వీలైనంత వరకు పింఛన్ల సంఖ్యను కుదించాలని కుస్తీ పడుతోంది. అందుకే డాక్టర్లను సైతం మార్పు లు చేసి ఈ పరిశీలనకు ప్రాధాన్యం ఇచ్చింది.
నడవలేక..నానా అగచాట్లు
వీల్‌చైర్‌లు, స్ట్రెచర్ల కోసం గంటల తరబడి వెతికినా దొరకడం లేదు. అక్కడక్కడా దయదలిచి సిబ్బంది కొంత మందికి మాత్రమే ఏర్పాటు చేయగలగుతున్నారు. మిగిలిన వారి బాధలు అంతులేనివి. మరోవైపు పెద్దాస్పత్రిలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ఏ మాత్రం ఉపయోగ పడటంలేదు. వీరి కళ్ల ముందే నడవలేక దివ్యాంగులు అగచాట్లు పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఇక వీల్‌చైర్‌లను వివిధ అవసరాలకు .. పుస్తకాలు, రోగుల బెడ్ షీట్లు, మందులకు సంబంధించిన మెటీరియల్‌ను ఉంచి నెట్టుకుంటూ వస్తున్నారు. ఇలా ఇతర పనులకు వీల్ చైర్‌లు దర్జాగా వినియోగిస్తున్నారు.
జిల్లాలోని పింఛన్ల సమాచారం
దివ్యాంగ 35,277
అంగవైకల్యం 19,927
అంధత్వం 3,093
వినికిడి లోపం 5,332
మానసిక వికలత్వం 5,283
బహుళ వైకల్యం 1,642
నాలుగు విభాగాలు ఏర్పాటు..
దివ్యాంగ పింఛన్‌దారులను రీ వెరిఫికేషన్ సెంటర్లకు రప్పిస్తోంది. గత నెల ప్రారంభమైన ప్ర క్రియ జూన్ వరకు కొనసాగనుంది. జిల్లాలోని 4 ఏరియా, 8 సీహెచ్‌సీ ఆస్పత్రులు.. చిత్తూరు నగరంలోని ప్రభుత్వ పెద్దాస్పత్రిలో కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంధత్వం, చెవిటి, మూగ, ఎముకల సంబంధిత, మానసిక దివ్యాంగుల దివ్యాంగత్వాన్ని పునఃపరిశీలనకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఒక్కో విభాగానికి 50 మంది నుంచి 60 మంది వరకు దివ్యాంగులు వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment