
పుంగనూరు: వాన కురిస్తే బైరేబండ క్రాస్ లో గుంతల రహదారి ఇలా..
రూ.56.93 కోట్ల పనులు రద్దు
రూ.49 కోట్ల టెండర్లు రద్దు
ఆర్‌అండ్‌బీ శాఖ ఆదేశం
ఇక గుంతల రోడ్లే శరణ్యం
పుంగనూరు రోడ్లకు చంద్ర గ్రహణం
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనం
పుంగనూరు : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పుంగనూరు నియోజకవర్గంలో రహదారులు అభివృద్ధి చేయాలని మంజూరు చేసిన పనులను తెలుగుదేశం ప్రభుత్వం కక్ష కట్టి రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారుల్లో పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు రావడంతో పనులు పెండింగ్‌లో పడ్డాయి. ఆ పనులు 25 శాతం మించి జరగలేదని, మరికొన్ని పనులు ప్రారంభించలేదనే కుంటి సాకుతో రూ.56.93 కోట్ల పనులను, రూ.49 కోట్ల టెండర్‌ను రద్దు చేస్తూ రహదారుల శాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్‌దండే ఉత్తర్వులు జారీ చేశారు.
రద్దు చేసిన పనుల వివరాలు
పుంగమ్మ చెరువు కట్టపై నుంచి ఉన్న శంకర్రాయలపేట రోడ్డు వయా బైరెడ్డిపల్లి, బెంగళూరుకు ప్రధాన రహదారి కావడంతో సుమారు 4 కిలోమీటర్ల రోడ్డులో సుమారు 300 గుంతలు ఉండటంతో ప్రయాణాల రాకపోకలు నరకంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్ల విస్తరణ, మరమ్మతులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నివేదికలు పంపారు. ఈ మేరకు అప్పటి ప్రభుత్వం పనులు చేపట్టాలని, ఇందుకు అవసరమైన రూ.7.87 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పనులను కాంట్రాక్టర్ చకచకా చేపట్టారు. 4 కిలో మీటర్లలో ఉన్న రోడ్డు కల్వర్టులను నిర్మించారు.
పుంగమ్మ చెరువు కట్టను విస్తరించి బలోపేతం చేసేందుకు సైడ్ వాల్స్ నిర్మించారు. ఇలా ఉండగా ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పనులు ఆపివేయాల్సి వచ్చింది. అలాగే చౌడేపల్లె మండలం కల్లుపల్లి – చౌడేపల్లె రోడ్డు 8 కిలో మీటర్లు రూ.12.49 కోట్లు , రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల – ఎర్రావారిపాళెం 14 కిలో మీటర్ల రోడ్డు రూ.20.59 కోట్లు, సోమల మండలం సోమల–పెద్ద ఉప్పరపల్లె రోడ్డు వయా నంజంపేట 5 కిలో మీటర్లకు రూ.11.42 కోట్లతో పాటు టెండర్ల స్టేజ్‌లో ఉన్న సదుం మండలం చెరుకువారిపల్లె – మతుకువారిపల్లె రోడ్డు 4 కిలో మీటర్లకు రూ.9 కోట్లు. చెరుకువారిపల్లె–నంజంపేట రోడ్డుకు 17 కిలో మీటర్లకు రూ.40 కోట్లు మంజూరు చేసింది. అనేక పనులు ప్రారంభించి మధ్యలో ఆగిపోయాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పుంగనూరుపై కక్ష కట్టింది. ఎంతో అవసరమైన ప్రధాన రహదారుల పనులను నిలిపివేసి , అనుమతులు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కక్షతో కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ పాలనలో మంజూరు చేసిన రూ.56 కోట్ల రోడ్డు పనులను రద్దు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. గుంతలమయంగా మారిన రోడ్లలో ప్రయాణాలు సాగించలేక నరకయాతన పడుతుంటే ప్రజల బాధ చూడలేక పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి కలిసి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వాటికి రూ.7 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఆ మేరకు 4. కి.మీ మేర కల్వర్టు పనులు కూడా వేగంగా చేపట్టారు. ఈ క్రమంలో ఎన్నికలతో పనులు ఆగిపోయాయి. అనంతరం టీడీపీ అధికారంలోకి రావడంతో పనులు వేగంగా సాగుతాయని ప్రజలు ఆశించారు. కానీ మాజీ మంత్రిపై బాబు కక్షతో ప్రజలు ఎన్ని కష్టాలు పడినా తనకేమనే విధంగా కుంటిసాకులతో రోడ్ల పనులను రద్దు చేయడంతో పుంగనూరులో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
గుంతలమయంగా బెంగళూరు రోడ్డు
పట్టణం నుంచి శంకర్రాయలపేట–బెంగళూరు రహదారి అధ్వానంగా ఉంది. దీంతో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. పుంగమ్మ చెరువు కట్టపై గల రోడ్డు దారుణంగా మారింది. అలాగే యాబైరాళ్ల మొరవ వద్ద పెద్ద గుంతలు పడ్డాయి. డాన్‌బోస్కో స్కూల్ , అరవపల్లి వద్ద, ఇటుకల బట్టీల వద్ద, ఆంజనేయస్వామి గుడి సమీపం , బైరేబండ సమీపం, కంపోస్ట్ యార్డు సమీపంలో లెక్కలేనన్ని గుంతలు పడ్డాయి. ఈ రహదారిలో కార్లు, ద్విచక్రవాహనాలు, బస్సులు ప్రయాణించాలంటే నరకయాతన పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment