అయ్యోర్ల జాబితా
ఉమ్మడి చిత్తూరు జిల్లా సమాచారం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు : 4,392 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు : 8,435 విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్‌లు : 7,534 జిల్లాలో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు : 901ఎస్జీటీ పోస్టులు మంజూరు : 8,295 విధులు నిర్వహిస్తున్న ఎస్జీటీలు : 6,443 ఎస్జీటీ ఖాళీ పోస్టులు : 1,852 పనిచేస్తున్న హెచ్‌ఎంలు : 408
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల సీనియారిటీ జాబితా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం అంత సులువు కాదు. ఈ కసరత్తు వేసవి సెలవుల్లో నిర్వహించుకోవాల్సింది పోయి..విద్యా సంవత్సరం చివర్లో కీలక సమయంలో నిర్వహిస్తున్నారు. దీంతో పదో తరగతి విద్యార్థుల పర్యవేక్షణ, పబ్లిక్ పరీక్షలకు కేంద్రాల ఏర్పాటు, టీచర్ల సమస్యలు అటకెక్కుతున్నాయి. టీడీపీ కూటమి అనాలోచిత నిర్ణయాలతో అటు టీచర్లు...ఇటు విద్యార్థులు అవస్థలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. నెల రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రభుత్వ టీచర్ల సీనియారిటీ జాబితా కసరత్తు చేపడుతున్నా పూర్తికాని పరిస్థితి నెలకొంది. ఇతర జిల్లాల్లో ఈ కసరత్తును పూర్తి చేసినప్పటికీ చిత్తూరు జిల్లాలో వెనుకబడి ఉన్నారు.
టీడీపీ కూటమి ఆర్భాటం కోసం..
వేసవి సెలవుల్లో బదిలీలు, ఉద్యోగోన్నతులు కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ రాష్ట్ర స్థాయిలో ప్రగల్బాలు పలికారు. క్షేత్రస్థాయిలోని సమస్యలు పట్టించుకోలేదు. ఆయన పబ్లిసిటీ కోసం విద్యాశాఖ సిబ్బందికి నిద్రలేని రాత్రులను గడిపేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 4392 ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని కేడర్‌లలో 14,394 మంది టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వారు సర్వీసులో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి వివరాలను డీఎస్సీల వారీగా సేకరించాల్సి ఉంటుంది. అలా సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఇలా నమోదు చేసిన వివరాలను పలు దశల్లో పరిశీలిస్తున్నారు. అయినప్పటికీ పలు తప్పిదాలు దొర్లే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు వెల్లడిస్తున్నాయి.
విడుదలలో ఇంకెన్ని సమస్యలో...
ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు చేపడుతున్న సీనియార్టీ జాబితా ఆన్‌లైన్ నమోదు కసరత్తు నేటితో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు. అయితే గురువారం సర్వర్ మొరాయించడంతో కసరత్తు పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఈ కసరత్తును ఆర్జేడీ శాఖ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం, కార్యాలయ ఏడీ విజయకుమార్, సూపరింటెండెంట్ బాబునాయక్‌తో పాటు డీఈఓ వరలక్ష్మి, జిల్లా విద్యాశాఖ ఏడీలు వెంకటేశ్వరరావు, రంగస్వామి పర్యవేక్షిస్తున్నారు. సీనియారిటీ జాబితా మొత్తం ఆన్‌లైన్ చేశాక జాబితాను విడుదల చేయనున్నారు. ఆ జాబితా విడుదల చేశాక ఇంకెన్ని సమస్యలు తలెత్తుతాయోనని ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టీచర్ల సీనియారిటీ జాబితాపై కొనసాగుతున్న కసరత్తు
ఎర్రర్‌తో డేటా తొలగిపోయి మొదటికొచ్చిన పనులు
నెల రోజులుగా నిర్వహిస్తున్నా పూర్తిగాని ప్రక్రియ
బడుల పర్యవేక్షణ పట్టని వైనం
రాత్రింబవళ్లు కుస్తీ...
టీచర్ల సీనియారిటీ జాబితాను ఆన్‌లైన్ చేసేందుకు డీఈఓ వరలక్ష్మితో పాటు విద్యాశాఖ సిబ్బంది రాత్రింబవళ్లు కుస్తీ పడుతున్నారు. మొదటి సారి ఎంతో కష్టపడి టీచర్ల పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అయితే ఆ వివరాల డేటా మొత్తం టెక్నికల్ ఎర్రర్ వల్ల తొలగిపోయింది. దీంతో మళ్లీ కసరత్తు మొదటికి వచ్చింది.చేసిన పనినే మరోమారు చేయాల్సి రావడంతో రాత్రిళ్లు నిద్ర మేల్కొని కసరత్తు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ కసరత్తుతో అటు అకడమిక్, ఇటు అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలు జాప్యం అవుతున్నాయి.
అయ్యోర్ల జాబితా
Comments
Please login to add a commentAdd a comment