మినిట్స్ వ్యవహారంపై చైర్మన్ ఆగ్రహం
● కలెక్టరేట్‌లో 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్
చిత్తూరు కలెక్టరేట్ : ముఖ్యమైన సమావేశాలు నిర్వహించేటప్పుడు చాలా అంశాలపై సమీక్ష నిర్వహిస్తారని అలాంటి వివరాలను మినిట్స్‌లో రాయకపోతే ఎలా అని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలో ముఖ్యమైన శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మినిట్స్ రాయడంలో అలసత్వం వహించిన సీపీఓ కార్యాలయ సిబ్బందిపై చైర్మన్ మండిపడ్డారు. అనంతరం కలెక్టర్ జోక్యం చేసుకుని మినిట్స్ తప్పులు లేకుండా కరెక్టుగా రాయాలని సర్ధిచెప్పారు. ప్రతి శాఖలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ.. జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో విజన్–2047, స్వర్ణకుప్పం 2029 కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రతి నియోజకవర్గానికి ఏటా ప్రత్యేక బడ్జెట్‌లో రూ.కోటి మంజూరుకు ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలో మ్యాంగో బోర్డు, సెరికల్చర్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ, చిత్తూరు, కుప్పంలో కేంద్రియ విద్యాలయం, డిజిటల్ సైన్స్ సెంటర్, జిల్లాలో పర్యాటకరంగం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ మాట్లాడుతూ.. అడవిపల్లి రిజర్వాయర్ పనులు 82 శాతం పూర్తయ్యాయని ఇందుకు అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళిమోహన్, మేయర్ అముద, డీఆర్‌ఓ మోహన్‌కుమార్, సీపీఓ సాంబశివారెడ్డి, డ్వామా పీడీ రవికుమార్, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈలు చంద్రశేఖర్‌రెడ్డి, విజయకుమార్, డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment