బకాయిల షాక్
● ప్రభుత్వ కార్యాలయాలకు గుదిబండగా విద్యుత్ బిల్లులు ● 11 శాఖల విద్యుత్ బకాయి రూ.22 కోట్లు ● అత్యధికంగా గ్రామ పంచాయతీ బకాయి రూ.420 కోట్లు
చిత్తూరు కార్పొరేషన్ : నిధుల సమస్యతో బిల్లుల చెల్లింపులో జాప్యం నెలకొందని ఆయా శాఖల అధికారులు పేర్కొంటున్నారు. పేదలు గడువులోపు బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ తొలగిస్తారు. గడువు దాటితే అపరాధ రుసుం వసూలు చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడం ఏమిటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.
11 శాఖలు రూ.22 కోట్లు
జిల్లాలో ప్రధానంగా 12 శాఖల ద్వారా రూ.22 కోట్ల బకాయిలు జనవరి నెల వరకు ఉంది. ఇందులో మున్సిపాలిటీలు అధికంగా ఉన్నాయి. ఎక్కువగా పలమనేరు మున్సిపాలిటీ నుంచి రూ.3.76 కోట్లు రావాల్సి ఉంది. ఆ తర్వాత జిల్లా గ్రామీణ నీటి సరఫరాశాఖ (ఆర్‌డబ్ల్యూఎస్), విద్యాశాఖ, పంచాయతీరాజ్, రెవెన్యూశాఖలు ఉన్నాయి. ఆరు నెలలుగా నిధులు సమస్యలు ఎదురవుతున్నాయని అందుకే సకాలంలో బిల్లులు చెల్లించలేకపోతున్నామని ఆయా ప్రభుత్వ కార్యాలయాల అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ శాఖ బకాయిలు వసూలు తప్పనిసరిగా చేయాలని గతంలో ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. నష్టాల పేరుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అయిదు నెలల్లోనే విద్యుత్ చార్జీలు పెంచింది. అయితే ప్రభుత్వ శాఖ విద్యుత్ బకాయిలకు నిధులు సకాలంలో విడుదల చేయడం లేదు. వీటిని వసూలు చేయడంలో అధికారులు నామ మాత్రపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
గ్రామ పంచాయతీల బకాయిలు
రూ.420 కోట్లు
చిత్తూరు జిల్లాలో మొత్తం 697 పంచాయతీలున్నాయి. కొన్నినెలలుగా మేజర్ పంచాయతీల పరంగా రూ.38.9 కోట్లు, మైనర్ పంచాయతీల పరంగా రూ.381.46 కోట్లు బకాయిలు ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు సర్కార్ స్మార్ట్ మీటర్లను బిగిస్తోంది. ఇది పూర్తి స్థాయిలో అమలయ్యాక తర్వాత ప్రీపెయిడ్ మీటర్‌గా మార్చనున్నారు. అప్పుడు రీచార్జ్ చేసుకుంటేనే కార్యాలయాలకు కరెంటు వస్తుంది. అంటే ఈ వందల కోట్లు బకాయిలు కొరకరాని కొయ్యగా విద్యుత్‌శాఖ నెత్తి మీద పడనుంది. సామాన్యుడు బిల్లు కట్టడం ఆలస్యమైతే ఇంటికెళ్లి ఫ్యూజ్ తీసుకొని నానా తిప్పలు పెట్టడం సిబ్బందికి అలవాటు. మరీ ప్రభుత్వ శాఖలపై ఎందుకు కనీస చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
డిమాండ్ నోటీసులు ఇస్తున్నాం
జిల్లాలోని వివిధ శాఖల విద్యుత్ బకాయిలు రూ.22 కోట్లకు చేరాయి. ఎక్కువగా పంచాయతీ బకాయిలు రూ.420 కోట్ల వరకు ఉంది. వీటి వసూలుకు తగిన చర్యలు చేపట్టాం. ఈ బిల్లులను వీలైనంత త్వరగా చెల్లించి సంస్థ అందించే మెరుగైన సేవల్లో భాగస్వాములు కావాలి. ప్రతి నెలా డిమాండ్ నోటీసులు ఇచ్చి, బిల్లులు చెల్లించాలని కోరుతున్నాం. – ఇస్మాయిల్ అహ్మద్, ఎస్‌ఈ , ట్రాన్స్‌కో
Comments
Please login to add a commentAdd a comment