భక్తుడికే తొలి పూజ!
● శ్రీకాళహస్తీశ్వరాలయంలో అంగరంగ వైభవంగా భక్తకన్నప్ప ధ్వజారోహణం
● తరలివచ్చిన భక్తజనం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం కన్నప్ప ధ్వజారోహణంతో ఆగమోక్తంగా అంకురార్పణ చేపట్టారు. తొలి పూజను భక్తునికే చెందేలా శివుడు వరమిచ్చాడు. ఈ క్రమంలో భక్తకన్నప్ప ధ్వజారోహణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. భక్తుడైన కన్నప్ప ఉత్సవమూర్తికి అభిషేక పూజలు నిర్వహించారు.
ముక్కోటి దేవతలకు ఆహ్వానం
కన్నప్ప ఉత్సవమూర్తిని మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ కొండపైకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. కొండపై వెలసిన కన్నప్ప ఆలయం వద్ద ఉత్సవమూర్తిని కొలువుదీర్చి గణపతి పూజ, పుణ్యాహ వచనం, మండప ఆరాధన, ధ్వజపూజ నిర్వహించారు. అనంతరం ధర్బ, మామిడాకులతో కట్టి తెల్లదారంతో దవళపతాకం, హారాన్ని ఎగురవేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ముల్లోకాల్లోని ముక్కోటి దేవతలకు సంకల్ప పూజతో వేదపండితులు శాస్త్రోక్తంగా ఆహ్వానం పలికారు.
సంప్రదాయం..నైవేద్య సమర్పణం
తర్వాత కన్నప్ప ఉత్సవమూర్తిని తిరిగి ఆలయం వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి సన్నిధి వీధిలో ఉభయదారులైన బోయ కులస్థులు ఏర్పాటు చేసిన విడిదిలో కొలువుదీర్చారు. బోయలు సంప్రదాయం ప్రకారం వస్త్రం, నైవేద్యం సమర్పించారు. అక్కడి నుంచి గ్రామోత్సవం ప్రారంభంమైంది. రాజగోపురం నుంచి చతుర్మాడ వీధీల్లో కన్నప్ప గ్రామోత్సవం వైభవంగా జరిగింది.
శాస్త్రోక్తంగా వాస్తు శాంతి పూజలు
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం రాత్రి వాస్తుశాంతి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామోత్సవం ముగిసిన తర్వాత ఆలయంలో వేదపండితులు గణపతి హోమం చేపట్టారు. అలాగే ఆలయానికి వాస్తు శాంతి హోమం నిర్వహించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి తల్లి బృందమ్మ, ఈవో బాపిరెడ్డి పాల్గొన్నారు.
భక్తుడికే తొలి పూజ!
భక్తుడికే తొలి పూజ!
Comments
Please login to add a commentAdd a comment