పకడ్బందీగా ‘పది’ పరీక్షలు
● రేపటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ ● డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు ● సమావేశంలో డీఆర్‌ఓ మోహన్‌కుమార్ వెల్లడి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఆర్‌ఓ మోహన్‌కుమార్ అన్నారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో శ్రీపదిశ్రీ పరీక్షల ఏర్పాట్లపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 17 నుంచి మార్చి 31 వరకు ఎస్‌ఎస్‌సీ, ఏప్రిల్ 1వతేదీ వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యాశాఖ, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు 118 కేంద్రాల్లో 20,954 మంది రెగ్యులర్, 294 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. దీంతో పాటు 20 పరీక్షా కేంద్రాలలో 1,165 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు మొత్తం 22,413 మంది హాజరు కానున్నారన్నారు.
సమయానికి కేంద్రాలకు చేరుకోవాలి
శ్రీపదిశ్రీ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని డీఆర్‌ఓ తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్య్హ్నాం 12.30 గంటల వరకు, ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఉదయం 9.30 గంటల లోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం అయితే 10 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని చెప్పారు. విద్యార్థులు ఆర్‌టీసీ బస్సుల్లో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. పరీక్షల నిర్వహణకు చీఫ్, డిపార్ట్‌మెంట్, ఇన్విజిలేటర్‌లను నియమించినట్లు తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద 163 నియమాలు
ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 163 భారత న్యాయ సంహిత నియమాలు వర్తిస్తాయన్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఎలాంటి జిరాక్స్ కేంద్రాలు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రైవేట్ పరీక్ష కేంద్రాల్లో జిరాక్స్ మిషన్‌లు, సీసీ కెమెరాలు పనిచేయకుండా పరీక్షలు పూర్తి అయ్యే వరకు సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు. జిల్లాలో 11 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ సెంటర్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సమస్యల పరిష్కారం కోసం డీఈఓ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారన్నారు. సమస్యలున్నట్‌లైతే 9032185001 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో డీఈఓ వరలక్ష్మి,, ఏడీ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.