కనిపించే దేవత అమ్మ
● ఆచార్య గార్లపాటి దామోదరనాయుడు ● ఘనంగా పైనేని మునెమ్మ స్మారక పురస్కారాలు
శ్రీరంగరాజపురం (కార్వేటినగరం) : తల్లికి మించిన దైవం ఏదీ లేదని.. కనిపించే దైవం అమ్మ అని ఆచార్య గార్లపాటి దామోదరనాయుడు అన్నారు. ఆదివారం ఆరిమాకులపల్లె తెలుగుతల్లి కళా ప్రాంగణంలో పైనేని మునెమ్మ స్మారక పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. తల్లిని పూజించగలిగిన వారే భార్యను ప్రేమించగలడని అన్నారు. అనంతరం శతావధాని ఆముదాల మురళీ మాట్లాడుతూ.. సమాజాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దడానికి తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కథల పోటీలలో గెలుపొందిన రోహిణి వంజారి (హైదరాబాద్), డాక్టర్ సుగుణారావు (విశాఖపట్టణం), ఓట్ర ప్రకాశరావు (తిరుత్తణి), నర్శిరెడ్డి (అనంతపురం), అరుణకుమారి (చిత్తూరు), సీతారామరాజు (కాకినాడ), డాక్టర్ కోటేశ్వరరావు (కరీంనగర్), సింహ ప్రసాద్ (హైదరాబాద్), విమల (చిత్తూరు), సారిపల్లి నారాయణ (హైదరాబాద్), మౌనిక (తిరుపతి) నగదు బహుమతులతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్ష ,కార్యదర్శులు పైనేని తులసీనాథం నాయుడు, పుష్ప, కోశాధికారి పైనేని మురళీ, జొన్నవత్తుల శ్రీరామచంద్రమూర్తి, ఆనందబాబు, నరేంద్ర, యుగంధర్, విజయేంద్రనాయుడు, కాంతమ్మ, రమ్య, రేణుక, ప్రసాద్ పాల్గొన్నారు.