రెడ్‌బుక్ రాజ్యాంగం ఇంకెన్ని రోజులు?
చిత్తూరు కార్పొరేషన్: ప్రశ్నించే గొంతుకపై కేసులు పెట్టి ఇంకెన్ని రోజులు రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపిస్తారని వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు మీరు చెప్పిన హామీలను అమలు చేయకపోవడంతో వాటిని ప్రశ్నించిన అధ్యాపకుడి పై అక్రమంగా కేసు పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐరాల మండలం కాణిపాకం గ్రామానికి చెందిన జ్యోతికుమార్ ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నాడన్నారు. పేద విద్యార్థుల బాధ చూడలేక అమ్మఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎప్పుడు ఇస్తారని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారన్నారు. దానిపై కక్ష గట్టిన అధికార పార్టీ నాయకులు అతనిపై సారా తరలిస్తున్నారని పోలీసులతో కేసు పెట్టించడం ఎంతవరకు న్యాయమన్నారు. ప్రశ్నించే గొంతుకపై కేసులు పెట్టి ఇంక ఎన్ని రోజులు రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపిస్తారని ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేస్తామని ఎన్నికలప్పుడు హామీలిచ్చారు.. వాటి అమలును అడిగితే కేసులు పెట్టే కొత్త పద్ధతిని టీడీపీ నాయకులు ప్రవేశపెట్టారన్నారు. ఇటువంటి తప్పుడు కేసులతో సభ్యసమాజానికి ఎటువంటి సందేశం ఇస్తారని ప్రశ్నించారు. ఏ రాజకీయపార్టీ అయినా చేసిన తప్పులను సోషల్‌మీడియా వేదికగా ఎత్తి చూపడం సహజంగా జరిగే ప్రక్రియ అన్నారు. అలానే అధ్యాపకుడు అడిగితే అన్యాయంగా కేసులు పెట్టారన్నారు. అతను భవిష్యత్‌లో ఎలా తలఎత్తుకుని తిరగగలరని అన్నారు. సోషల్‌మీడియా పోస్టులపై 111 సెక్షన్ వర్తించదని కోర్టు చెబుతున్నా పోలీసులు అక్రమంగా కేసుపెట్టారన్నారు. ఇలాగే ఉంటే పోలీసులపై పూర్తిగా నమ్మకం పోతుందని ఎస్పీకి సూచించారు. వీటిని విద్యావేత్తలు సహించారన్నారు. ఇలాగే తప్పుడు కేసులు కొనసాగితే భవిష్యత్‌లో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, నాయకులు అంజలిరెడ్డి, మధురెడ్డి, చాన్‌బాషా, అప్పొజీ, ప్రసాద్‌రెడ్డి, ప్రతిమారెడ్డి, నౌషాద్, స్టాండ్లీ, వెంకటేష్, హరీషారెడ్డి, మదన్, సంపత్, రాజేష్, రంజిత్, మురళీ, రమేష్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.


