సంఘాల అభివృద్ధికి చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : క్రెడిట్ అండ్ లైవ్‌లీ హుడ్ ప్రణాళికను పక్కాగా సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు పలు శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ వరుస సమావేశాలు నిర్వహించారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోరారు. సంఘాల ఆధ్వర్యంలో పొందే రుణాలను సద్వినియోగం చేసుకునేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సంఘం సభ్యులకు సంబంధించిన నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా ఇబ్బంది పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు మంజూరు చేసే రుణాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
11న ఉద్యానవన పంటలపై సమావేశం
జిల్లా కేంద్రంలో ఎన్‌పీసీ కన్వెన్షన్ సెంటర్‌లో ఉద్యానవన పంటలపై సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈనెల 11న జిల్లా కేంద్రంలో ఉద్యాన పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 72 వేల హెక్టార్లలలో ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా మామిడి 25 మండలాల్లో ప్రధాన పంటగా, మామిడిలో తోతాపురి ఎక్కువగా సాగులో ఉండడం వల్ల దిగుబడి ఏటా లభిస్తోందన్నారు. మామిడి గుజ్జు తయారీకి చిత్తూరు ప్రధాన కేంద్రంగా మారిందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మామిడి పంట, దిగుబడి నిలకడగా లేకపోవడం వల్ల మామిడి గుజ్జు ఎగుమతులపై ప్రభావం చూపిందన్నారు. ఇందుకు సంబంధించి అవగాహన కల్పించేందుకు రాష్ట్రస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉద్యాన పంటల అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందన్నారు. జిల్లాలోని రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


