ఏఎంసీ చైర్మన్ గిరి ఎవరికో!
● పలమనేరు బీసీ మహిళలకు రిజర్వేషన్ ఖరారు ● ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఎంపికలో అధిష్టానం ● బలంగా వినిపిస్తున్న ఇద్దరి పేర్లు
పలమనేరు : నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత ప్రొటోకాల్ ఉన్న పోస్టు మార్కెట్ కమిటీ చైర్మన్. ఏఎంసీ చైర్మన్‌కు అన్ని మండలాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాల్లో సముచిత స్థానం ఉంటుంది. దీంతో తాజాగా కూటమి అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలోని పలు మండలాల నాయకుల కన్ను చైర్మన్ కుర్చీపై పడింది. జిల్లాలోని పది మార్కెట్ కమిటీలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఆ మేరకు పలమనేరు ఏఎంసీ బీసీ మహిళలకి కేటాయించారు. ఇప్పటికే జిల్లాలోని కొన్ని ఏఎంసీలకు కొత్త చైర్మన్లను కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో పలమనేరు కనిపించలేదు. ఎందుకంటే దీనికి కూటమి నేతల్లో ఎక్కువగా డిమాండ్ ఉండడం, స్థానిక ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఎవరిని సూచిస్తున్నారు, ఇదే సమయంలో పార్టీ అధిష్టానం ఇటీవల చేపట్టిన ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా ఎవరి పేరు వచ్చిందనే విషయం స్థానికంగా హాట్‌టాపిక్ మారింది.
ఇప్పుడే డిమాండ్ ఎందుకంటే..
పలమనేరు సమీపంలోని క్యాటిల్‌ఫామ్ వద్ద 33 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ టమాట మార్కెట్‌ను రూ.55 కోట్లతో నిర్మించనున్నారు. ఇది జిల్లాలోనే మోడల్ మార్కెట్‌గా చేయాలని మార్కెటింగ్ అధికారులు నిర్ణయించారు. హైవేకు ఆనుకుని వాణిజ్య సముదాయాలను నిర్మించనున్నారు. మార్కెట్‌కు వచ్చిన కూరగాయలకు అక్కడికక్కడే ప్యాకింగ్, గ్రేడింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. రైతుల సౌకర్యార్థం క్యాంటీన్లు, రైతు విశ్రాంతి గదులు తదితరాల నిర్మాణాలు ఉంటాయి. దీనికి సమీపంలోనే పశువులు, గొర్రెల వారపు సంతలుంటాయి. ఇలాంటి మోడల్ మార్కెట్ రూ.33 కోట్లతో పనులు జరుగనున్న నేపథ్యంలో తమ ఆధ్వర్యంలోనే ఇక్కడ ఇంటిగ్రేటెట్ మార్కెట్ ప్రారంభించామని చెప్పుకోవచ్చు. పైగా ఇందులో వారికి తగిన ప్రతిఫలం దక్కుతుందనే మాట గట్టిగా వినిపిస్తోంది.
ఆ ఇద్దరు ఎవరు?
మొన్నటి దాకా ఇక్కడి బీసీ మహిళా రిజర్వేషన్‌ను మార్చి జనరల్ చేస్తారనే మాట వినిపించింది. కానీ పలమనేరు నియోజకవర్గంలో ఎక్కువగా బీసీ ఓటర్లు ఉండడంతో ముందు నిర్ణయించినట్లే రిజర్వేషన్లలో మార్పు లేకుండా పోయింది. ఇక్కడ టీడీపీని అంటిపెంటుకున్న బీసీ కులాల్లో 22 వేల దాకా కురబ సామాజిక వర్గ ఓటర్లున్నారు. మిగిలిన బీసీ కులాల్లో వాల్మీకి, వడ్డెర, పల్లెగౌండర్‌ల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైర్మన్ గిరి కోసం గంగవరం మండలానికి చెందిన ఓ బీసీ యువనేత సతీమణి పేరు గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యేకు వీర విధేయుడైన బైరెడ్డిపల్లికి చెందిన ముఖ్య నాయకుడి సతీమణి సైతం బరిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రజాభిప్రాయమా..
స్థానిక ఎమ్మెల్యే అనుచరులకా
ఇప్పటి దాకా స్థానిక ఎమ్మెల్యే ఎవరిని సూచిస్తే వారికి ఏఎంసీ చైర్మన్ గిరి దక్కడం జరిగేది. కానీ పలమనేరు ఏఎంసీకి సంబంధించి అధిష్టానమే ఫోన్‌ల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తోందని తెలిసింది. ఆ మేరకు స్థానిక ఎమ్మెల్యే సూచించిన వారికే పదవి దక్కుతుందా లేదా అధిష్టానం మాట చెల్లుతుందా అనేది వేచి చూడాల్సిందే. ఏదేమైనా ఏఎంసీ చైర్మన్ విషయంలో పార్టీ కోసం కష్టపడిన బీసీలకే న్యాయం జరగాలనే మాట నియోజవర్గంలోని ఆ పార్టీ బీసీల్లో గట్టిగా వినిపిస్తోంది.


