జ్యోతిబా పూలే జయంతి ఘనంగా నిర్వహించండి
చిత్తూరు కలెక్టరేట్: జిల్లా కేంద్రంలో ఈ నెల 11వ తేదీన మహాత్మాజ్యోతి బా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహాత్మా జ్యోతి బా పూలే జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీసీ భవన్‌లో శుక్రవారం జిల్లాస్థాయి కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ వర్గాలకు చెందిన 500 మంది లబ్ధిదారులకు రూ.11,66,30,000 విలువ గల ఆస్తులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, బీసీ కుల సంఘ నాయకులు, అధికారులు, అనధికారులు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
ఉత్సాహంగా తపాలా క్రీడా పోటీలు
చిత్తూరు కార్పొరేషన్: తపాలాశాఖ ఉద్యోగులకు ఎన్‌ఎఫ్‌పీఈ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం క్రీడ పోటీలు నిర్వహించారు. స్థానిక మెసానికల్ మైదానంలో క్రికెట్ టోర్నీ ఉత్సాహంగా జరిగింది. ఈ పోటీల్లో చిత్తూరు దక్షిణ సబ్ డివిజన్ జట్టు విజేతగా నిలిచింది. ఆటగాళ్లకు తపాలా శాఖ సూపరింటెండెంట్ లక్ష్మన్న పతకాలను ప్రదానంచేశారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.
అలరించిన సెలెస్టా–2కే25
కాణిపాకం: చిత్తూరు నగరంలోని ఎస్పీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలో కేరళ మేళంతో సెలెస్టా–2కే25 అట్టహాసంగా ప్రారంభమైంది. తొలుత కాలేజీ కుర్రకారు స్టేజ్‌పై స్టెప్పులేసింది. విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు కేక పుట్టించాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన సినీ నటుడు కిరణ్ అబ్బవరం సెలెస్టాను ఉద్దేశించి మాట్లాడారు. స్టేజ్‌పై స్టెఫులేసి అలరించారు. కార్యక్రమంలో చైర్మన్ రావూరి వెంకటస్వామి, రావూరి శ్రీనివాసులు పాల్గొన్నారు.
జ్యోతిబా పూలే జయంతి ఘనంగా నిర్వహించండి


