కాంట్రాక్టు పనుల కోసం.. కల్వర్టును కూల్చిన ఘనుడు
● ప్రశ్నించేందుకు భయపడుతున్న అధికారులు ● ఇదీ ఓ తెలుగు తమ్ముడి నిర్వాకం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : కాంట్రాక్టు పనుల కోసం బాగున్న కల్వర్టును కూల్చిన ఓ తెలుగు తమ్ముడి ఘన కార్యమిది.. కూటమి నాయకుల కుట్రలకు .. జగనన్న కాలనీ లబ్ధిదారులకు శాపంగా మారింది. మండలంలో ఒక షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఓ చోటా తెలుగు తమ్ముడు తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యేకి నేను ఎంత చెబితే అంతే అంటూ.. వారితో కలిసి దిగిన ఫొటోలను అధికారులకు చూపించి అక్రమాలు చేస్తూ చెలరేగిపోతున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా.. కత్తెరపల్లి పంచాయతీ పరిధిలోని సిద్ధేశ్వర ఆలయ సమీపంలో 2014లో అప్పటి ప్రభుత్వం డంపింగ్ యార్డు నిర్మాణం చేసింది. అయితే కృష్ణాపురం జలాశయం ఎడమ కాలువ అడ్డంగా ఉండడంతో కాలువపై కల్వర్టు నిర్మాణం చేశారు. అనంతరం 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డంపింగ్ యార్డు సమీపంలో జగనన్న కాలనీ పేరుతో పక్కా గృహాలు మంజూరు చేసింది. అయితే జగనన్న కాలనీకి వెళ్లే లబ్ధిదారులు, వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులకు, సిద్ధేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు అనుకూలంగా ఉన్న కల్వర్టును ఆ చోటా తెలుగు తమ్ముడు రాత్రికి రాత్రే జేసీబీతో కల్వర్టును కూల్చి అందులో ఉన్న సిమెంట్ పైపులను తన సొంతానికి వాడుకున్నాడు. అలాగే అదే కల్వర్టు స్థానంలో నూతనంగా కల్వర్టు నిర్మాణం చేసి ప్రజాధనాన్ని దోచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కల్వర్టును కూల్చిన సమాచారం తెలిసినా ప్రశ్నిస్తే ఉద్యోగాలు ఉంటాయో.. ఊడుతాయోననే భయంతో అధికారులు నోరెత్తడం లేదు. ఆ పచ్చనేత ఆగడాలు మండలంలో మితిమీరి పోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


