పరిహారం కుదింపుపై ఆందోళన
బైరెడ్డిపల్లి : పరిహారం మరీ ఇంత తక్కువ ఇవ్వడం ఏంటి సార్ అంటూ ఎక్స్‌ప్రెస్ హైవేలో భూములు పోగొట్టుకున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగానే అధికారులు, పోలీసుల బందోబస్తు మధ్య స్థలాలను స్వాధీనం చేసుకున్న ఘటన మండల కేంద్రమైన బైరెడ్డిపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎక్స్‌ప్రెస్ హైవే వారు స్థలాల్లో జేసీబీలు, టిప్పర్లతో చదును చేసేందుకు రాగా రైతులు అడ్డుకున్నారు. దీంతో పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులను పక్కకు తప్పించి స్థలాలను ఎక్స్‌ప్రెస్‌హైవే వారికి స్వాధీనం చేయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు బాధితులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. బెంగళూరు– చైన్నె ఎక్స్‌ప్రెస్ హైవేలో భాగంగా బైరెడ్డిపల్లిలో జంక్షన్ కోసం భూములను సేకరించారు. ఇందులో చెక్‌పోస్ట్ పక్కన ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసిన 25 మంది దాకా ఉన్నారు. ఇంటి స్థలాలు కాబట్టి అప్పటి సబ్ కలెక్టర్ వీరికి అడుగుకు రూ.1640 చొప్పున అవార్డు ఇచ్చేలా నిర్ణయించారు. కానీ ఆపై జేసీ వచ్చి ఈ ధరను రూ.154కు తగ్గించారు. దీనిపై కడుపు మండిన కొందరు బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. కొందరు మాత్రం అధికారుల మాట నమ్మి ఇందుకు అంగీకరించారు. దీంతో ఇన్నాళ్లు ఇక్కడి పనులు పెండింగ్ పడ్డాయి. అయితే ఎక్స్‌ప్రెస్ హైవే అధికారులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించడంతో పోలీసుల పహారా మధ్య భూములు, స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. నష్ట పరిహారం తక్కువ అనుకునే రైతులు జేసీ కార్యాలయంలో ఆర్భిట్రేషన్‌కు రావాలని అధికారులు సూచించారు. పనులను అడ్డుకున్న రైతులను పోలీసులు పక్కకు తప్పించి పనులు చేయించారు. దీంతో మొత్తంగా చదును జరిగిపోయింది. చేసేదీ లేక రైతులు బాధ పడుతూ నిరాశతో తిరుగుముఖం పట్టారు.
అడుగుకు రూ.154 పరిహారంపై మండిపాటు
బైరెడ్డిపల్లి ఎక్స్‌ప్రెస్ హైవే పనుల వద్ద ఉద్రిక్తత


