నేడు యథావిధిగా రిజిస్ట్రేషన్ సేవలు
చిత్తూరు కార్పొరేషన్ : రెండో శనివారం ప్రభుత్వం సెలవు రోజు అయినప్పటికీ యథావిధిగా రిజిస్ట్రేషన్ సేవలు కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. క్రయవిక్రయదారులకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. వీటితో పాటు జిల్లా రిజిస్ట్రార్, డీఐజీ కార్యాలయాలు పనిచేస్తాయని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు.
శాస్త్రోక్తంగా పునఃనిర్మాణ పూజలు
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ పునఃనిర్మాణ పూజలను శుక్రవారం శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయంలో విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట, బింబ స్థాపన పూజలను వేద మంత్రోచ్ఛరణాలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్, ఈవో పెంచల కిషోర్, మాజీ చైర్మన్ మోహన్‌రెడ్డి, మణినాయుడు, సర్పంచ్ శాంతిసాగర్‌రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలో
నియామకాలు
చిత్తూరు కార్పొరేషన్ : వైఎస్సార్‌సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీలో నియమాకాలు చేపట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురికి రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలో పలు హోదాల్లో చోటు కల్పించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం వివరాలను ప్రకటించింది. రాష్ట్ర విద్యార్థి విభాగంలో ఉపాధ్యక్షుడిగా ఓబుల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా యుగంధర్, కార్యదర్శిగా నరేష్, సంయుక్త కార్యదర్శిగా కలయన్ భరత్, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగంలో ప్రధాన కార్యదర్శులుగా ఉపేంద్రరెడ్డి, పదార్థి రాధకృష్ణారెడ్డి, కార్యదర్శిగా అనిల్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఇంటలెక్ఛువల్ ఫోరం ఉపాధ్యక్షుడిగా అవిలా లోకనాథరెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ విభాగంలో కార్యదర్శిగా డాక్టర్.సైమన్‌సీజర్‌బండారు, సంయుక్త కార్యదర్శిగా సురేంద్రకుమార్‌ను నియమించారు.


