ఫలితాలపై పరేషాన్ వద్దు !
పరీక్షా ఫలితాల సమయంలో ర్యాంకులు రాలే దని కొందరు.. మార్కులు తక్కువ వచ్చాయని ఇంకొందరు.. ఎక్కువ మార్కులు రాలేదని మరికొందరు..ఫెయిల్ అయ్యామని కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. పరీక్షా ఫలితాల వేళ క్షణికావేశ నిర్ణయాలు మంచివికాదు. విద్యార్థి ప్రతిభకు మార్కులు గీటురాయి కాదు. మార్కుల ఆధారంగా తెలివితేటలు అంచనా వేయడం సరైందికాదు. పిల్లల మార్కులను తల్లిదండ్రులు ప్రతిష్టగా భావించడం తప్పు. ప్రపంచంలోని మేథావులంతా ఎక్కువ మార్కులు సాధించిన వారేంకాదు.. విద్యా సంస్థల యాజమాన్యాలు మార్కుల వెంట పరుగెత్త కూడదు. పరీక్షలే సర్వస్వం కాదు.. జీవితం ఎంతో ఉందని విద్యావేత్తలు, మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నేడు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులపై ప్రత్యేక కథనం.
చిత్తూరు కలెక్టరేట్ : ఇంటర్ మూల్యాంకనం పూర్తి అ య్యింది.. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాల విడుదల సమయం రానే వచ్చింది. శనివారం ఉదయం 11 గంటలకు పరీక్షా ఫలితాలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అయింది. ఫ లితాల సమయంలో విద్యార్థులు క్షణికావేశంలో ఎ లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని విద్యావేత్తలు, మానసిక వైద్యనిపుణులు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 139 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలున్నాయి. ఈ కళాశాలల నుంచి విద్యార్థులు 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షలకు దాదాపు 30 వేల మంది హాజరయ్యారు.
విద్యార్థులకు మంచి జీవితం ఇవ్వాలని ఆశించేది తల్లిదండ్రులే. కంటికి రెప్పలా చూసుకుంటూ.. వారి బంగారు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేది తల్లి దండ్రులే. పిల్లలకు ఏ చిన్న దెబ్బ తగిలినా తమకే తగిలినట్లు విలవిలలాడేది తల్లిదండ్రులే. అయితే అలాంటి తల్లిదండ్రులకు ధైర్యంగా ఉండాల్సిన విద్యార్థులు పలుచోట్ల ఆత్మహత్యలకు పాల్పడి మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. అయితే తల్లిదండ్రులు కూడా అంత గా ప్రేమించే వారిపై మార్కుల ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని విద్యావేత్తలు చెబుతున్నారు.
దండించొద్దు..ధైర్యం చెప్పండి..
ఇంటర్ ఫలితాలు శనివారం విడుదల కానున్న నేపథ్యంలో ఫలితాల్లో ఎవరైనా ఫెయిల్ అయితే వారిని దండించకుండా ధైర్యం చెప్పాలి. ఇంటర్ ఫెయిల్ అయినప్పటికీ విద్యార్థులకు సప్లిమెంటరీ రూపంలో మరో అవకాశం ఉంటుంది. అది రాసి మళ్లీ పాస్ కావచ్చు. ఉన్నత విద్యకు అర్హత సాధించవచ్చు. ఫెయిల్ అయ్యామని చులకనగా చూసే సమాజం ముందే తలెత్తుకుని జీవించవచ్చు. అవేమీ ఆలోచించకుండా క్షణికావేశంలో విద్యార్థులు మనోవేదనకు లోనుకావద్దు. పరీక్ష తప్పామని, ర్యాంకులు రాలేదని, ఎక్కువ మార్కులు తెచ్చుకోలేదని, వారిని ఒత్తిడికి గురిచేస్తే క్షణికావేశానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. తల్లిదండ్రులు ఫలితాల సమయంలో పిల్లలపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదని విద్యావేత్తలు వెల్లడిస్తున్నారు.
క్షణికావేశం కాదు.. క్షణం ఆలోచించండి
ప్రతిభకు మార్కులు కొలమానం కాదు
పరీక్షలే సర్వస్వం అనుకోవద్దు
నేడు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల విడుదల
ఫలితం ఎలా ఉన్నా..
పరీక్షల ఫలితాలు అంటేనే చాలా మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో కంగారు ఉండటం సహజమే. ఫలితాలు ఎలా ఉంటాయో....తమకు ఫలితాలు ఎలా వస్తాయోనని విద్యార్థులు సైతం టెన్షన్ పడటం సహజమే. కానీ, పరీక్షల ఫలితం ఎలా వచ్చినా ఆందోళన చెందకూడదని, రిజల్ట్స్ ఎలా ఉన్నా పాజిటివ్ గా స్పందించాలని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. అనుకున్న దాని కంటే తక్కువ మార్కులు వచ్చాయని, చదివిన చదువుకు తగిన ఫలితాలు రాలేదని అతిగా స్పందించాల్సిన అవసరం లేదంటున్నారు. ఒక్క ఓటమితోనే తమ చదువు ముగిసిపోదని, ఉత్తమ ఫలితాలు సాధించగానే హీరోలైపోరని గుర్తించాలని వెల్లడిస్తున్నారు.
జీవితం నష్టపోదనే భరోసా ఇవ్వాలి
ఒకసారి పరీక్షలో తప్పితే జీవి తం నష్టపోదనే భరోసానివ్వా లి. మళ్లీ చదివి పాస్ కావచ్చనే ధైర్యం నింపాలి. పాస్ కాలేదని తిట్టకుండా, వేధించకుండా స ముదాయించాలి. తిరిగీ మంచిగా చదివి పాసయ్యే లా ప్రోత్సహించాలి. విద్యార్థులు కూడా క్షణికావేశానికి లోనుకాకుండా సమస్యను స్నేహితులు, తల్లిదండ్రులు, సన్నిహితంగా ఉండే టీచర్లతో చర్చించాలి. మార్కులు కాదు విజ్ఞానమే ముఖ్య మనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి.
– డాక్టర్ ప్రవీణ్‌కుమార్, మెడికల్ ఆఫీసర్,
గంగాధర నెల్లూరు
ఓ కన్నేసి ఉంచాలి...
నేడు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు క్షణికావేశానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అధ్యాపకులు, తల్లిదండ్రులు మార్కులు తక్కువ వచ్చినా.. ఫెయిల్ అయిన విద్యార్థులను చిన్నచూపు చూడకూడదు. విద్యార్థి ప్రతిభకు మార్కులు కొలమానం కానే కాదు. విద్యాసంస్థల యాజమాన్యాలు మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి తీసుకురాకూడదు. జీవితంలో ఏదైనా సాధించాలనే కసి, పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిగిన వారే ఏదైనా సాధిస్తారు. ప్రపంచ విజేతలుగా నిలుస్తారు.
– సయ్యద్ మౌలా, ఇంటర్మీడియట్ డీవీఈఓ, చిత్తూరు జిల్లా
ఈ విషయాలు మరువొద్దు..
ఫలితాలు ఎలా వచ్చినా.. విద్యార్థులు పాజిటివ్‌గా తీసుకోవాలి. విద్యార్థులతో పాటు కుటుంబం, స్నేహితులు, అధ్యాపకులు, చుట్టు పక్కల వారు ప్రవర్తించే తీరు ప్రభావం చూపుతుంది.
ఫెయిలైన విద్యార్థి ఇంతటితోనే అంతా అయిపోయిందనే భావనను వీడాలి. ఓ పరీక్షలో మాత్రమే ఫెయిలయ్యామని, జీవితంలో కాదన్న విషయాన్ని గ్రహించాలి.
ప్రధానంగా క్షణికావేశానికి గురికాకూడదు. తొందరపాటుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. తమలోని బాధను పంచుకోవడంతో పాటు నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టాలి.
సభ్యులు, స్నేహితులు, చుట్టు పక్కల వారు ఫెయిలైన విద్యార్థులపై చులకన భావంతో ఉండకూడదు. స్నేహితులు, బంధువులు వారిని ఎగతాళి చేసినట్లు మాట్లాడొద్దు.
వారికి తల్లిదండ్రులు, స్నేహితులు ఎలాంటి ప్రోత్సాహం అందిస్తారో, ఫెయిలైన వారిని కూడా అలాగే వెన్నుతట్టి ప్రోత్సహించాలి.
ఫెయిలైనా జీవితంలో విజేతలుగా నిలిచిన వారి గురించి తెలియజేయాలి. ఆలోచిస్తూ బాగా చదివేలా వారిని ప్రోత్సహించాలి.
ఇన్ని చెప్పినా విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడు తున్నట్లు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఫలితాలపై పరేషాన్ వద్దు !
ఫలితాలపై పరేషాన్ వద్దు !


