దిక్కు దిక్కునా ధనం
● పొరిగింటి రోడ్లపై రూ.కోట్లు కుమ్మరింపు ● పోటీ తప్పిస్తూ.. సింగిల్ టెండర్లకు ఆమోదం ● ‘పచ్చ’ నేతలకే పనులు.. ఇద్దరికే రూ.కోట్ల కట్టలు ● పీఆర్, ఆర్‌అండ్‌బీ రోడ్లకు మున్సిపల్ నిధులు
చిత్తూరు అర్బన్: మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రస్తుతం నిధుల ప్రవాహం పారుతోంది. ఖజానాలోని నిధులను పాలకవర్గం ఓ స్థాయిలో ఖర్చు చేస్తోంది. నగర అభివృద్ధికి నిధులు ఖర్చుపెట్టడంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందేమీ ఉండదు. పైగా అందరూ స్వాగతిస్తారు. కానీ తమకు సంబంధం లేని రోడ్లపై రూ.కోట్లు కుమ్మరిస్తున్నారు. కాగా నగర నడిబొడ్డున, శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల గురించి ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ప్రధాన రోడ్లపై పనులు చేయడం సులభంగా ఉండడం, పైగా రూ.పది పెట్టుబడి పెడితే.. రూ.4 లాభం వస్తుండడంతో కాంట్రాక్టర్లకు ఇష్టారాజ్యంగా పనులు అప్పగిస్తున్నా రు. తొమ్మిది నెలల కాలంలో దాదాపు రూ.3.5 కోట్ల విలువైన పనులను ఇద్దరు ‘పచ్చ’ నేతలకే అప్పగించారు.
కొత్త సంప్రదాయం..
రూ.50 లక్షల్లోపు అభివృద్ధి పనులకు పాన్, ఐటీ రిటర్న్స్, కంపెనీ రిజిస్ట్రేషన్ ఉంటే రెండో దశలో ఫైనాన్స్ బిడ్ చూస్తారు. రూ.50 లక్షలకు పైబడిన పనులకు అనుభవం తప్పనిసరి. ఇందులో తక్కువ మొత్తం కోట్ చేసిన వారికి పనులు ఇవ్వాలి. కానీ ఓ పని చేయడానికి ఇద్దరి కంటే ఎక్కువ టెండర్లు దా ఖలైతే పోటీలో ఉన్న కాంట్రాక్టర్ల నుంచి ‘తాము ఈ టెండర్ల నుంచి తప్పుకుంటున్నట్లు’ ఓ కాగితంతో రాసి సంతకాలు పెట్టి, అధికారులకు ఇస్తున్నారు. దీంతో పోటీలో ఉన్న ఒకే వ్య క్తికి పనులు అప్పగిస్తూ అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. 40 పనులకు ఆన్‌లైన్ టెండర్లు పిలిస్తే.. అన్నీ సింగిల్ టెండర్లనే ఆమోదించారు. రామ్‌నగర్ కాలనీలోని జనసేన పార్టీకి చెందిన కాంట్రాక్టర్ చేత బలవంతపు సంతకాలు తీ సుకున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక అధికార పార్టీకి చెందిన కీలక వ్యక్తి చక్రం తిప్పుతున్నట్లు ఆ పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. కూటమికి చెందిన ఒకే ఒక్క కాంట్రాక్టర్‌కు రూ.5 కోట్ల విలువైన 30 పనులు అప్పగించారు.
చిక్కులు తప్పవా?
నగరంలో ఫారెస్టు–పీవీకేఎన్ కళాశాల దారిలో దాదాపు రూ.80 లక్షల కార్పొరేషన్ నిధులు వెచ్చించి రోడ్డు పనులు చేస్తున్నారు. వాస్తవానికి ఇది పంచాయతీరాజ్ శాఖకు చెందిన రోడ్డు. ఆ శాఖలో నిధులు లేవా..? అంటే పుష్కలంగా ఉన్నా యి. అయినా సరే కాంట్రాక్టర్‌కు లాభం చేకూర్చడానికి ఇలా చేస్తున్నారనే విమర్శలున్నాయి. పీసీఆర్ పాఠశాల కూడలిలో దాదాపు రూ.40 లక్షల వ్యయంతో పండ్ల దుకాణాల కోసం షెడ్లు వేసి, నిర్మాణాలు పూర్తి చేశారు. ఇది ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన రోడ్డు. భవిష్యత్తులో రోడ్డు విస్తరణ జరిగితే ఈ షెడ్లు మొత్తం తీసేయాల్సిందే. అయినా సరే పాలకులు కార్పొరేషన్ నిధులను నేలపాలు చేస్తున్నారు. జిల్లా కోర్టు వద్ద నిర్మిస్తున్న ప్రహరీ గోడకు రూ.40 లక్షలపైనే నిధులు వెచ్చిస్తున్నారని, ఇ ది ఆర్‌అండ్‌బీ శాఖకు చెందిన రోడ్డని ఇటీవల డిప్యూటీ మే యర్ చంద్రశేఖర్ కౌన్సిల్ సమావేశంలో నిలదీసినా స్పందనలేదు. పాలకులు చెప్పిందల్లా చేస్తూ పోతే, చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సిందేననే విషయాన్ని అధికారులు విస్మరిస్తున్నారు.
నగరంలో వసతులు శూన్యం
కార్పొరేషన్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో కనీస వసతుల్లేవు. నగరం నడిబొడ్డున ఉన్న ప్రజల సదుపాయాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు. ఇవేమీ పట్టని పాలకు లు నలుదిక్కులా ఉన్న పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్ల కోసం నిధులను మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఇది విమర్శలకు దారితీస్తోంది.
దిక్కు దిక్కునా ధనం


