కారు బోల్తా.. 10 మందికి గాయాలు
దేవరపల్లి : అతి వేగంగా వెళుతున్న కారు 16వ నంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పి, పంట పొలాల్లో బోల్తా పడి, ఒకే కుటుంబానికి చెందిన 10 మంది గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బందార్లపల్లికి చెందిన 10 మంది కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శనివారం మధ్యాహ్నం 2.40 గంటల సమయానికి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్దకు చేరుకున్నారు. అక్కడ కారు ఒక్కసారిగా అదుపుతప్పి హైవే పై నుంచి పల్టీలు కొడుతూ పంట పొలాల్లో పడింది. ఈ ప్రమాదంలో కారులోని 10 మంది కుటుంబ సభ్యులు స్వల్పంగా గాయపడ్డారు. కారులోని వారిని స్థానికులు బయటకు తీసి, హైవే అంబులెన్స్‌లో గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదని పోలీసులు చెప్పారు. గాయపడిన వారిలో గౌరక్క (కోతుల లత), గౌరక్కగారి చిన్నమ్మాయి, కోతుల సోమశేఖర్, కోతుల యశ్వంత్, కోతుల చందన, భార్గవి, పభ్రేష్, లలిక, శిరీష, కారు డ్రైవర్ శ్రీకాంత్ ఉన్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు దేవరపల్లి ఎస్సై ఇ.సుబ్రహ్మణ్యం తెలిపారు.
కారు బోల్తా.. 10 మందికి గాయాలు


