పేదలపై ప్రభుత్వం చిన్నచూపు
–మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
వెదురుకుప్పం : కూటమి ప్రభుత్వం పది నెలలుగా చేసింది కేవలం మోసాలతో ప్రజలను బురిడీ కొట్టించి పేదల కడుపుకొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలేనని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వా మి ఆరోపించారు. ఆదివారం ఆయన పుత్తూరులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా పేదలను చిన్న చూపు చూస్తోందని విమర్శించారు. అక్రమ కేసులు బనాయిస్తూ అవలంబిస్తున్న నిరంకుశత్వ ధోరణిని నేనెప్పుడూ చూడలేదన్నారు. జగనన్నకు భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని పక్కన పెట్టి హోం మంత్రి అనిత వెటకారంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతున్నట్లు చెప్పారు. ప్రజల తిరుగుబాటు మొదలైతే ఎలాంటి వారైనా ప్రజాగ్రహానికి గురౌతారని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా కూటమి ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎస్సీ నేతలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరును తప్పు పడుతూ హైకోర్టు మొట్టి కాయలు వేస్తున్నా మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇటీవల జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్, ఎంపీపీ ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో ఉన్న నాయకులు ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులకు వెరవకుండా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి పార్టీకి వెన్నుదన్నుగా నిలబడడం విశ్వసనీయత, నిబద్దతతకు నిదర్శనమన్నారు. పీఏసీలో సభ్యుడుగా తనకు స్థానం కల్పించినందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు శివాజి, సుబ్రమణ్యం పాల్గొన్నారు.


