డైయింగ్‌ ప్లాంట్లు తరలించాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

డైయింగ్‌ ప్లాంట్లు తరలించాల్సిందే!

Apr 26 2025 12:28 AM | Updated on Apr 26 2025 12:28 AM

డైయిం

డైయింగ్‌ ప్లాంట్లు తరలించాల్సిందే!

● అజెండా తీర్మానం వాయిదా ● మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన

నగరి: నగరి మున్సిపల్‌ సమావేశానికి హాజరైన కౌన్సిలర్లు మిషన్‌ డైయింగ్‌, మాన్యువల్‌ డైయింగ్‌ యూనిట్లు ఏదైనా సరే ఊరిలో ఉండకూడదు దూరంగా నివాసేతర ప్రాంతాలకు తరలించాల్సిందేనంటూ అజెండా తీర్మానం వాయిదా వేసి రోడ్డెక్కారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట మున్సిపల్‌, పొల్యూషన్‌ బోర్డు అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలులో చైర్మన్‌ పీజీ నీలమేఘం అధ్యక్షతన మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణారెడ్డి మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అయితే అధికారులు పొందుపరచిన అజెండాను వినడానికి కూడా తాము సంసిద్ధంగా లేమని డైయింగ్‌ యూనిట్ల పొల్యూషన్‌ సమస్య పరిష్కారం అయిన తరువాతే అజెండాలోని అంశాలు వింటామని అధికారులకు స్పష్టం చేశారు. దీనిపై కమిషనర్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ డైయింగ్‌ యూనిట్లపై చర్యలు తీసుకోవాల్సింది పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మాత్రమేనని వారు ఆరు యూనిట్లు సక్రమంగా ఉన్నాయంటూ కార్యాలయానికి లేఖ అందిందన్నారు. దీనిపై వైస్‌ చైర్మన్లు వెంకటరత్నంరెడ్డి, బాలన్‌తో పాటు కౌన్సిలర్లు బీడీ భాస్కర్‌, దయానిధి, ఇంద్రయ్య, కోఆప్షన్‌ సభ్యులు ఎల్లప్పరెడ్డి మాట్లాడుతూ సక్రమంగా ఉందంటే అది ఏ ఆధారంగా తేల్చారన్నారు. గతంలో ఏ ప్లాంటు సక్రమంగా నిర్వహించడం లేదని మున్సిపల్‌ అధికారులు స్పష్టం చేస్తే, నేడు బాగుందని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని ప్లాంట్లు మూసే అధికారం మీకు లేకుంటే చేతులెత్తేయండి ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్‌ మోహన్‌రాజ్‌ మాట్లాడుతూ 16 డైయింగ్‌ యూనిట్లు ఉంటే అందులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారి ప్లాంట్లకు మాత్రమే సీల్‌ వేశారన్నారు. అన్ని డైయింగ్‌ యూనిట్లు మూసి వేస్తామని అధికారులు చెబుతున్నారని, అయితే టీడీపీకి చెందిన కొన్ని మిషన్‌ డైయింగ్‌, మాన్యువల్‌ డైయింగ్‌ యూనిట్లు నిర్వహణలో ఉన్నాయన్నారు. వైస్సార్‌సీపీ వారి ప్లాంటు నుంచి విషం వస్తే టీడీపీ ప్లాంటు నుంచి అమృతం వస్తుందా? అంటూ అధికారులను నిలదీశారు. ప్లాంటు ఏదైనా మూసివేయాల్సిందే ఊరికి దూరంగా వెళ్లాల్సిందే అన్నారు. దీంతో కౌన్సిలర్లు అందరూ ఏకీభవించారు. ఓ దశలో సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేయడానికి కౌన్సిల్‌ సిద్ధమైంది. దీనిపై చైర్మన్‌ పీజీ నీలమేఘం మాట్లాడుతూ పాలకవర్గంగా ఉన్నవారే బాయ్‌కాట్‌ చేయడం సబబుకాదన్నారు. డీఈ మాట్లాడుతూ కౌన్సిలర్లు హాజరైనట్లు రికార్డు ఉంటేనే గౌరవ వేతనం కూడా వస్తుందన్నారు. దీనిపై కౌన్సిలర్లు మాట్లాడుతూ కౌన్సిలర్ల మాటలకు గౌరవమే లేనపుడు గౌరవ వేతనం ఎందుకని ప్రజల బాగు కోసం వేతనం వదులుకోవడానికి కూడా తాము సిద్ధమన్నారు. పారాటానికి తాను కూడా సిద్ధమేనని, అయితే పద్ధతి ప్రకారం పోరాడుదామని చైర్మన్‌ తెలపడంతో కౌన్సిలర్‌ గోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ డైయింగ్‌ ప్లాంట్లను తరలించే వరకు సమావేశం జరిగినా ఏ అంశానికి కౌన్సిల్‌ ఆమోదం ఉండదని వాయిదా తీర్మానాలే వేయాలని ఇందుకు సమ్మతమా? అని ప్రశ్నించారు. దీనిపై అందరూ ఏకీభవించడంతో హాజరు పట్టికలో మాత్రమే సంతకాలు చేసి తీర్మానాలు వాయిదా వేసిన కౌన్సిల్‌ సమావేశం నుంచి బయటకు వచ్చి రోడ్డెక్కింది. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిలబడి నిరసన వ్యక్తం చేసింది. డైయింగ్‌ ప్లాంట్లను దూరప్రాంతాలకు తరలించడమే మా ప్రధాన అజెండా అని, అది నెరవేరేంతవరకు ఏ అజెండాలకు ఆమోదం లేదంటూ స్పష్టం చేసింది.

డైయింగ్‌ ప్లాంట్లు తరలించాల్సిందే! 1
1/1

డైయింగ్‌ ప్లాంట్లు తరలించాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement