
చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
చిత్తూరు అర్బన్ : ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. చిత్తూరు నగర శివారులోని జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం సమీపంలో ఈనెల 6వ తేదీన ఓ ద్విచక్రవాహనం ఢీ కొని, దాదాపు 62 ఏళ్ల వయస్సున్న వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందగా, శనివారం ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిస్తే 94910 74515 , 70135 54201 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.
తాళాలు పగులగొట్టి
నగలు చోరీ
పుంగనూరు : గుడికి వెళ్లి వచ్చేలోపు ఇంటి తాళాలు పగులగొట్టి సుమారు రూ.20 లక్షలు విలువ చేసే నగలు, నగదును దోచేసిన ఘటన శుక్రవారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని బజారువీధిలో నివాసం ఉన్న రాధాకృష్ణయ్యశెట్టి కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్లి ఇంటికి వచ్చారు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించి చూడగా ఇంట్లో ఉన్న బీరువాను పగులగొట్టి 150 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి వస్తువులు, రూ.40 వేలు నగదు అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాహనాలను
ఢీ కొట్టిన కారు
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలో ఓ వ్యక్తి కారుతో అతివేగంతో వచ్చి.. మరో రెండు వాహనాలను ఢీ కొట్టాడు. శనివారం కట్టమంచి వద్ద ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబరుతో అతి వేగంతో వస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఆపై ఆటోను ఢీ కొట్టి, ఓ పాదచారిని సైతం ఢీ కొట్టారు. కారులో ఉన్న పిల్లలకు స్వల్ప గాయాలు కాగా పాదచారి చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. గాయపడ్డ వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాలకమండలిలో
బీజేపీకి అన్యాయం
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ప్రధాన ఆలయాల పాలక మండలి నియామకాల్లో బీజేపీకి తీవ్ర అన్యాయం జరుగుతోందని బీజేపీ నాయకులు విమర్శించారు. శనివారం చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. నాయకులు రామభద్ర మాట్లాడుతూ.. చిత్తూరు నగరంలోని ప్రధాన ఆలయాల్లో పాలక మండలి ఏర్పాటు నియామకంలో తమ పార్టీకి చెందిన నాయకులకు చైర్మన్ పదవులు అడగలేదన్నారు. కనీసం పాలక మండలి సభ్యులుగా పదవులు ఇవ్వాలని కోరామన్నారు. అయితే బీజేపీ తరఫున చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయానికి పంపిన ప్రతిపాదనలపై ఇంత వరకు అతీగతీ లేదన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఏం జరుగుతుందో ఆయనకే తెలియాలని ఆవేదన చెందారు. ఎమ్మెల్యే సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తమ పార్టీకి జరుగుతున్న అన్యాయంపై దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం, తోటపాలెం వెంకటేష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.