ఉమామహేశ్వర్ (ఫైల్)
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: వివాహమైన పన్నెండేళ్ల తర్వాత ఆ దంపతులకు బాబు పుట్టాడు. ఆ సంతోషం వారికి కొద్ది రోజులు కూడా నిలవలేదు. రాత్రి తల్లి చెంత నిద్రించిన రెండు నెలల బాలుడు తెల్లారేసరికి వాటర్ ట్యాంకులో విగతజీవిగా కనిపించాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్‌లో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అనాజ్‌పూర్‌కు చెందిన మంచాల రంగయ్య కూతురు లతకు ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లి నివాసి దూసరి తిరుమలేశ్‌తో పన్నెండేళ్ల కింద పెళ్లయింది. అప్పటినుంచి దంపతులకు సంతానం కలగలేదు. రెండు నెలల కిందటే వారికి బాలుడు జన్మించగా, ఉమామహేశ్వర్ అని పేరు పెట్టుకున్నారు.
బాబు పుట్టినప్పటి నుంచి అనాజ్‌పూర్‌లోని పుట్టింట్లో తమ్ముడు బాల్‌రాజ్, మరదలు శ్వేతతో కలసి లత ఉంటోంది. తిరుమలేశ్ తరచూ వచ్చి భార్య, కొడుకును చూసి వెళ్తుండే వాడు. అయితే గురువారం రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత లత తన బాబును పక్కనే పడుకోపెట్టుకుని నిద్రించింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆమె లేచిచూడగా కుమారుడు కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురై విషయాన్ని కుటుంబీకులకు తెలిపింది. చివరకు ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్‌లో బాలుడు విగతజీవిగా తేలాడు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ స్వామి డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంతో వివరాలు సేకరించారు.
కుటుంబీకులే చంపారా?
పసికందును కుటుంబీకులే చంపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడి మేనమామ బాల్‌రాజ్, అతడి భార్య శ్వేతను అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి బయటి వ్యక్తులు వచ్చే అవకాశం లేదని, వారిద్దరే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చనే అనుమానంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment