నేరం తానే చేశానని ధ్రువీకరించిన నిందితుడు సతీష్
పోలీస్ కస్టడీ విచారణలో వెలుగులోకి ఆసక్తికర అంశాలు
ఏ2 ప్రేరణ, పక్కాప్లాన్‌తోనే దాడి
నిందితుడికి ముగిసిన మూడురోజుల పోలీస్ కస్టడీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాయి దాడి పక్కాప్లాన్, ముందస్తు కుట్రతో జరిగిందని మరోసారి తేటతెల్లమైంది. ఏ2 పోద్బలంతోనే సీఎం జగన్‌పై రాయితో దాడిచేసినట్లు ప్రధాన నిందితుడు (ఏ1) వేముల సతీష్కుమార్ పోలీసుల వద్ద అంగీకరించినట్లు సమాచారం. వివేకానంద స్కూల్ వద్ద కంటే ముందు డాబా కొట్ల కూడలిలోనే రాయి విసిరేందుకు మొదట ప్రయత్నించినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది.
న్యాయస్థానం ప్రత్యేక అనుమతితో విచారణ నిమిత్తం ఈ నెల 25వ తేదీన నిందితుడు సతీష్ ను పోలీసులు మూడురోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మూడు రోజులు సతీష్‌ను అతడి తండ్రి దుర్గారావు, అతడి న్యాయవాది సమక్షంలో సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో విచారించారు.
శనివారం కస్టడీ ముగిసిన వెంటనే నిందితుడిని పోలీసులు సబ్‌జైలులో అప్పగించారు. మూడురోజుల విచారణ, సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సీల్డ్ కవర్‌లో న్యాయాధికారికి అందజేశారు. విచారణలో నిందితుడు పూర్తిగా సహకరించలేదని, అతడు ఇంకా ఏదో దాస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా నిందితుడిని విచారించాల్సి ఉందని భావిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు..
మూడురోజుల విచారణలో దాడికి సంబంధించిన పలు కుట్రపూరిత అంశాలను సతీష్ పోలీసులకు వివరించినట్లు తెలిసింది. ఈ నెల 13వ తేదీన ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్ వద్ద సీఎం జగన్‌పై హత్యాయత్నం వెనుక ఏ2తో పాటు, మరికొందరి కుట్ర ఉందని స్పష్టమవుతోంది. ఆ రోజు ఉదయం నిందితుడు వేముల సతీష్కుమార్ కూలిపనికి వెళ్లాడు. అదేరోజు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సెంట్రల్ నియోజకవర్గంలో ఉండటంతో హత్యాయత్నానికి వారు కూలిపని చేస్తున్న ప్రదేశంలోనే స్కెచ్ వేశారు.
ఆ రోజు సాయంత్రం వరకు ఎలా దాడిచేయాలి? ఎలా తప్పించుకోవాలి? దాడిచేస్తే ఎంత డబ్బు చెల్లిస్తారు? వంటి అంశాలను ఏ1తో కలిసి ఏ2 చర్చించాడు. ప్రధానంగా పోలీసులు ఏ2గా అనుమానిస్తున్న వ్యక్తి ప్రోద్బలంతోనే ఏ1 సతీష్ హత్యాయత్నానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారు నివసించే వడ్డెర కాలనీ అరుగు మీద ఆ రోజు సాయంత్రం ఆరు నుంచి ఆరున్నర గంటల వరకు ఈ కుట్ర ఎలా అమలు చేయాలనే అంశంపై వారు చర్చించారు. అనంతరం సతీష్ తన ఇంటి నుంచి నడుచుకుంటూ సింగ్‌నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు.
ఆ సమయంలో సీఎం జగన్ బస్సుయాత్ర గవర్నమెంట్ ప్రెస్ కూడలి దాటి ఫ్లైఓవర్‌పై వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. మరో రెండు నిమిషాల్లో యాత్ర తాను నిలబడిన (డాబాకొట్లు) సెంటర్ వద్దకు చేరుకుంటుందని గ్రహించిన నిందితుడు సతీష్ వంతెన వద్దే ఓ కాంక్రీట్ రాయిని సేకరించాడు. ఆ సమయంలో సతీష్తో పాటు అతడి స్నేహితుడు ఉన్నాడు. బస్సుయాత్ర డాబాకొట్లు సెంటర్‌కు చేరుకోగానే అప్పుడే సీఎం జగన్‌పై రాయి విసేరేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ వద్దని, ఎవరైనా చూస్తే దొరికిపోతామని సతీష్ను అతడి స్నేహితుడు వారించి నిలువరించాడు.
భయపడిన ఆ స్నేహితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బస్సుయాత్ర వివేకానంద స్కూల్ వద్దకు చేరడానికి ముందే సతీష్ వేగంగా స్కూల్, గంగానమ్మ గుడి మధ్యనున్న చీకటి ప్రాంతానికి చేరుకున్నాడు. ముందే సేకరించిన కాంక్రీట్ రాయితో ఆ ప్రదేశం నుంచే సీఎం జగన్‌పై దాడిచేశాడు. రాయి బలంగా విసరడంతో సీఎం జగన్‌తో పాటు ఆయన పక్కనే ఉన్న సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
దాడిచేసిన వెంటనే తన ఇంటికెళ్లిన సతీష్ అక్కడే ఉన్న టీడీపీ నాయకులను కలిశాడు. తరువాత వారంతా అక్కడ టపాసులు కాల్చారు. ఈ విషయాలన్నీ పోలీసులు నిర్వహించిన సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో నిర్ధారణ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment