జియాగూడ: తల్లిని వేధిస్తున్నాడని కన్నతండ్రినే అంతమొందించాడు ఓ యువకుడు. హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉండే నారాయణరావు మోరె(54) ఆటోడ్రైవర్. ఆయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య చంద్రకళ నవోదయనగర్, రెండో భార్య విష్ణుకాంత కేశవస్వామినగర్‌లో ఉంటున్నారు. చంద్రకళకు ఇద్దరు కుమారులు నామ్‌దేవ్(33), మహదేవ్(30), కూతురు రాధిక ఉన్నారు. విష్ణుకాంత సంతానం శ్రీకాంత్ మోరె, యశోద. నామ్‌దేవ్, మహదేవ్‌లు పంజాగుట్టలోని భజరంగ్‌లాల్ జ్యువెలరీ, లలితా జ్యువెలరీలో పనిచేస్తున్నారు. ఈ నెల 28న రాత్రి 10 గంటల ప్రాంతంలో విష్ణుకాంత ఇంటి నుంచి నారాయణరావు బయలుదేరి చంద్రకళ వద్దకు వెళ్లారు.
నామ్‌దేవ్, నారాయణరావుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తన తల్లిని వేధిస్తున్నాడని తండ్రిపై నామ్‌దేవ్ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి నారాయణరావు, నామ్‌దేవ్ మళ్లీ గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన నామ్‌దేవ్ హెల్మెట్ చైన్‌ను తండ్రి గొంతుకు వేసి బిగించాడు. కాలితో వృషణాలపై తన్నడంతో నారాయణరావు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే ఆటోలో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలోనే ఆయన చనిపోయారు. నామ్‌దేవ్, మహదేవ్ కలిసి తండ్రి మృతదేహాన్ని లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మూసీనదిలో పడవేశారు.
అయితే తన తండ్రి కనిపించడంలేదంటూ శ్రీకాంత్ మోరె మరునాడు కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు శనివారం సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానంతో నామ్‌దేవ్, మహాదేవ్‌లకు ఫోన్ చేశారు. హత్యోదంతం బయటపడటంతో వారు వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలీసులు మూసీనదిలో వెతికించి నారాయణరావు మృతదేహాన్ని బయటకు తీసి మార్చురికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment