
కేపీహెచ్‌బీకాలనీ: గుడిలో ప్రదక్షిణలు చేయటానికి వెళ్లిన ఓ వ్యక్తి గుండెనొప్పితో మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేపీహెచ్‌బీ రోడ్డు నెంబర్ 1లో అమ్మ హాస్టల్‌లో కానంపల్లి విష్ణువర్ధన్(31) ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడు ప్రతిరోజు ఉదయం ఆలయానికి వెళ్తుంటాడు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం 7 గంటలకు కేపీహెచ్‌బీ టెంపుల్ బస్‌స్టాప్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లాడు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇతర భక్తులు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలిస్తుండగా అంతలోనే మృతి చెందాడు. విషయాన్ని ఆయన సోదరి హేమలతకి ఫోన్ ద్వారా తెలియచేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.