ప్రతీకాత్మక చిత్రం
భోపాల్: తల్లిని చిత్రహింసలు పెడుతున్న తండ్రి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిర్ణయం తీసుకుందో కూతురు. తమకు ప్రశాంతత లేకుండా చేస్తున్నాడనే కారణంతో తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసింది. దాంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ కూతురు జైలుపాలైంది. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. పదహారేళ్ల బాలిక తన తల్లిదండ్రులు, అన్నయ్యతో కలిసి భోపాల్‌లో నివసిస్తోంది. తల్లి, అన్న దినసరి కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, తండ్రి పనీపాట లేకుండా తిరుగుతూ ఉండేవాడు. అంతేగాక రోజూ మద్యం సేవించి భార్యను తీవ్రంగా కొట్టేవాడు. (చదవండి: పెళ్లి చేసుకుంటామని నమ్మించి, ఆపై)
ఈ క్రమంలో కొడుకు, కూతురు ఎన్నోసార్లు అతడికి నచ్చజెప్పి చూశారు. తాగుడు మానేయాలని సూచించారు. కానీ అతడు వారి మాటలను పట్టించుకోలేదు. తండ్రి ప్రవర్తనతో విసిగిపోయిన సదరు బాలిక, ఆమె అన్న అతడిని పట్టించుకోవడం మానేశారు. ఈ క్రమంలో కొడుకు పెళ్లిచేయాలని నిశ్చయించుకున్న వారి తల్లి, బుధవారం సాయంత్రం ఈ విషయం గురించి కుటుంబ సభ్యుల వద్ద ప్రస్తావించింది. ఇందుకు సంబంధించి చర్చ నడుస్తుండగా, ఇంటి పెద్ద అయిన తండ్రి వారితో గొడవకు దిగాడు. అంతేగాక భార్యను అసభ్య పదజాలంతో దూషిస్తూ, ఆమెపై దాడి చేశాడు.
దీంతో, అక్కడే ఉన్న వారి కూతురు, తల్లిని కొట్టవద్దని, ఆమెను విడిచిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తండ్రిని హెచ్చరించింది. అయినా అతడు ఆమె మాట వినలేదు. దీంతో కోపోద్రిక్తురాలైన సదరు బాలిక, బట్టలు ఉతికేందుకు ఉపయోగించే బ్యాట్‌తో తండ్రిపై దాడికి దిగింది. ఆ తర్వాత ఐరన్ రింగులతో జతచేయబడిన ఉన్న మరో కర్ర తీసుకుని తలపై మోది, కింద పడేసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆమె తండ్రి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడిక్కడే మృతిచెందాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసిన బాలిక, తానే తండ్రిని హతమార్చానని నేరం అంగీకరించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment