6 నెలల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడు
నిందితుడు వరుసకు తాత
పోక్సో కేసు నమోదు
రిమాండ్‌కు తరలింపు
రామభద్రపురం: రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. విజయనగరం జిల్లాలో 6 నెలల చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. నంద్యాల జిల్లాలో 8 ఏళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన మరువక ముందే.. విజయనగరం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. రామభద్రపురం మండలం కొండకెంగువ పంచాయతీ మధుర గ్రామ పరిధిలోని జీలికవలసలో శనివారం 6 నెలల పసికందుపై వరుసకు తాత అయిన వ్యక్తి లైంగిక దాడికి ఒడిగట్టాడు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటల సమయంలో పసి పాపకు స్నానం చేయించిన తల్లి ఊయలలో నిద్ర పుచ్చి0ది.
గ్రామంలోకి నిత్యావసర సరుకులు రావడంతో.. కొనుగోలు చేసేందుకు తల్లి వీధిలోకి వెళ్లింది. ఇంతలో అదే గ్రామానికి చుట్టపు చూపుగా వచ్చిన నేరళ్లవలసకు చెందిన.. బాధిత చిన్నారికి తాత వరసైన బోయిన ఎరకన్నదొర (40) ఊయలలో నిద్రలో ఉన్న పాపపై లైంగిక దాడి చేయడంతో ఏడ్చింది. పక్కింటి వారు పాప ఏడుస్తున్న విషయాన్ని తల్లికి కేక వేసి చెప్పగా.. బిడ్డ ఎందుకు ఏడుస్తుందో చూడమని తన పెద్ద కుమార్తెకు చెప్పింది. పెద్ద కుమార్తె చూసి ‘చెల్లిని తాతయ్య ఎత్తుకున్నాడు. రక్తం వస్తోంది’ అని తల్లికి చెప్పింది.
తల్లి పరుగున వచ్చేసరికి ఎరకన్నదొర పాపను ఊయలలో వేసేసి పారిపోయాడు. పసిపాపకు రక్తస్రావం కావడాన్ని చూసిన తల్లి ఎరకన్నదొరను వెంబడించి అతడిపైకి కర్ర విసిరింది. ఆమె వెంబడించడం చూసి గ్రామస్తులు కూడా పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయినా.. ఎరకన్నదొర తప్పించుకుపోయాడు. పాపను బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి విజయనగరంలోని ఘోషాస్పత్రికి తరలించారు. బాడంగి వైద్యాధికారులు పోలీసులను సంప్రదించాలని సూచించడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు క్లూస్‌టీం సహాయంతో జీలికవలస గ్రామానికి వెళ్లి పాప దుస్తులను సీజ్ చేశారు. ఆదివారం వేకువజామున నేరళ్లవలసలో నిందితుడు ఎరకన్నదొరను అదుపులోకి తీసుకుని అతని దుస్తులపై ఉన్న రక్తపు మరకలను సేకరించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. నిందితుడు గతంలోనూ ఇటువంటి ఘటనలకు పాల్పడ్డాడని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం పాప విజయనగరం ఘోషాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉంది. డీఎస్పీ వెంట సీఐ తిరుమలరావు, ఎస్‌ఐ జ్ఞానప్రసాద్ ఉన్నారు.
బాలల హక్కుల కమిషన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: ఆరు నెలల చిన్నారిపై జరిగిన అఘాయిత్యంపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఘోషాస్పత్రి పర్యవేక్షణ అధికారిణి అరుణ శుభశ్రీతో మాట్లాడి, మెరుగైన చికిత్స అందించాలని కోరారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యంత్రాంగం దృష్టి సారించాలని సూచించారు. కాగా.. ఈ ఘటనను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు ఖండించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని, నిండితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment