కోస్గిలోని ఓ కల్లు డిపోలో తయారు చేస్తున్నమందు కల్లు
తెల్లగా మెరుస్తుంది. కలిపితే నురగ వస్తుంది. పుల్లపుల్లగా, తియ్యతియ్యగా ఉంటుంది. తాగితే తలతిరిగి పడిపోయేంత నిషా వస్తుంది.. మరి ఇది ఏ తాటిచెట్టు నుంచో, ఈత చెట్టు నుంచో తీసినది కాదు. అచ్చంగా స్వచ్ఛమైన మందు కల్లు. అసలైన కల్లు ఒక్క చుక్క ఉంటే ఒట్టు.. అంతా రసాయనాలు, నిషేధిత మత్తు పదార్థాలు కలిపిన బోరింగ్ నీళ్లే. ఈ ‘మందు’కల్లు తాగేవారు కొద్దిరోజుల్లోనే బానిసలుగా మారుతున్నారు. ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. ఈ దందాపై ‘సాక్షి’నిర్వహించిన క్షేత్రస్థాయిలో పరిశీలనలో ఆందోళనకర విషయాలెన్నో బయటకొచ్చాయి. ఈ వివరాలతో ప్రత్యేక కథనం..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా మందు కల్లు దందా విచ్చలవిడిగా సాగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ దందా సాగుతోంది. మందు కల్లు తయారీలో వాడే ఆల్ఫ్రాజోలం, డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్) వంటి మత్తు పదార్థాలను ప్రభుత్వం నిషేధించినా.. దొంగచాటుగా రవాణా, వినియోగం సాగుతూనే ఉంది.
మహారాష్ట్రలోని ముంబై, పుణె, నాగ్‌పూర్‌తోపాటు గుజరాత్, కర్ణాటకల నుంచి రాష్ట్రానికి క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్), ఆల్ఫ్రాజోలం రవాణా అవుతోంది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి దొంగచాటుగా కొన్ని ముఠాలు ఈ మత్తు పదార్థాలను తరలిస్తున్నాయి.
పోటెత్తుతున్న మందు కల్లు..
►ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా మందు కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. మొత్తం కల్లు విక్రయాల్లో 70 శాతానికిపైగా ఇదే ఉన్నట్టు ఎక్సైజ్ వర్గాలే చెప్తున్నాయి. ఓ కల్లు డిపో నడుపుతున్న వ్యక్తి మండలాల వారీగా ఏజెంట్లను పెట్టుకుని మరీ ఆల్ఫ్రాజోలం, సీహెచ్, డైజోఫాం సరఫరా చేస్తున్నట్టు సమాచా రం. సదరు వ్యక్తికి రాజకీయ నేతల అండదండలు ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు.
►ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా మందు కల్లు పోటెత్తుతోంది. జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు ఉండగా.. 400కుపైగా గ్రామాల్లో మందు కల్లు విక్రయాలు సాగుతున్నాయి. నిజామాబాద్ పట్టణంతోపాటు బోధన్, ఎడపెల్లి, రెంజల్, ఇతర మండలాల్లోని డిపోల్లో అమ్మే కల్లు అంతా రసాయనాలతో తయారు చేసినదేనని స్థానికులు చెప్తున్నారు.
►మెదక్ జిల్లాలోని రామాయంపేట, అల్లాదుర్గం, కొల్చారం నర్సాపూర్, తూప్రాన్‌లో సైతం మం దు కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
►గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతా ల్లోని కల్లు డిపోల్లోనూ మందు కల్లు విక్రయాలు జరుగుతున్నట్టు స్థానికులు చెప్తున్నారు.
నేతలే ఓనర్లు.. లేకుంటే వాటాలు..
మందు కల్లు డిపోల్లో చాలావరకు ద్వితీయశ్రేణి రాజకీయ నేతల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయని ఆరోపణలున్నాయి. వారు పైస్థాయి నేతల సమావేశాలు, సభలు, ప్రజాప్రతినిధులు సూచించిన ఇతర ఖర్చులను భరిస్తున్నారని.. కొందరు అధికారులకు మాత్రం మామూళ్లు వెళ్తుంటాయని చెప్తున్నారు. ఇక రాజకీయాల్లో లేని నిర్వాహకుల ‘లెక్క’లు వేరే ఉంటాయని గీత కార్మిక సొసైటీలు చెప్తున్నాయి.
కల్లు డిపోకు సమకూరిన ఆదాయంలో గీతవృత్తి, సొసైటీదారులకు 50 శాతం, పోలీసులకు 5%, ఎక్సైజ్ శాఖకు 10 శాతం, రాజకీయనేతలకు 10%, చందాలకు 10 శాతం, అనుచరులకు 5 శాతం, స్వచ్ఛంద కార్యక్రమాలకు 10 శాతం చొప్పున ఇస్తున్నట్టు పేర్కొంటున్నాయి.
కల్లు కాదు.. ఉత్త రసాయనాలే..
చాలా డిపోల్లో అమ్ముతున్న కల్లులో అసలైన కల్లు మొత్తానికే ఉండదు. అంతా నీళ్లు, రసాయనాలే. పు లుపు రావడానికి నిమ్మ ఉప్పు, తెలుపు రంగు కోసం సిల్వర్ వైట్, తీపి కోసం శాకరిన్, నురుగు కోసం డ్రైఈస్ట్, కుంకుడుకాయల రసాన్ని వినియోగిస్తున్నారు. మత్తు కోసం ఆల్ఫ్రాజోలం, డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్) వంటి రసాయనాలను కలుపుతున్నారు. ఒక్కో సీసా మందు కల్లును ఆ యా ప్రాంతాన్ని బట్టి, కలిపిన రసాయనాలను బ ట్టి రూ.10 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు.
ఖర్చు రూ.6,650.. ఆదాయం రూ.36,000
2,400 సీసాల (100 కేసుల) మందు కల్లు తయారీ కోసం.. నిమ్మ ఉప్పు రూ.110–140, సిల్వర్ వైట్ రూ.150 వరకు, శాకరిన్ రూ.180, కుంకుడుకాయలు రూ.30, డ్రైఈస్ట్‌కు రూ.150వరకు.. ఆల్ఫ్రాజోలం కోసం రూ.6 వేల వరకు ఖర్చవుతుందని కల్లు డిపోల వర్గాలు చెప్తున్నాయి. ఈ లెక్కన 2,400 సీసాల కల్లుకు రూ.6,650 వరకు ఖర్చు ఉండగా.. ఒక్కో సీసా సగటున రూ.15కు విక్రయిస్తే రూ.36 వేల వరకు ఆదాయం వస్తుండడం విశేషం. ఎక్కువ రేటుకు అమ్మేచోట్ల అయితే.. ఏకంగా 50 వేలకుపైనే వస్తుంది.
బలవుతున్నది కూలీలు, కార్మికులే..
మందు కల్లు తాగుతున్న వారంతా పేదలే. వ్యవసాయ పనులకెళ్లే కూలీలు, అడ్డా కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర అసంఘటిత రంగ కార్మికులే. వారంతా మందు కల్లుకు అలవాటుపడి బానిసలుగా మారుతున్నారు. రోజూ తాగకుండా ఉండలేని స్థితికి చేరుకుంటున్నారు. తాగుతూనే ఉంటే శరీరం గుల్ల అవుతుంది. ఒక్కసారిగా ఆపేస్తే మానసిక పరిస్థితి దెబ్బతినడం, ఫిట్స్, పిచ్చిగా ప్రవర్తించడం వంటి దుష్పరిమా ణాలు ఎదురవుతున్నాయి. కోవిడ్ లాక్‌డౌన్ సమ యాల్లో ఇలాంటి ఘటనలు ఎన్నో కనిపించాయి.
నిజామాబాద్ జిల్లాలో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులు (ఫైల్)
గతంలో నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగి ఇద్దరు చనిపోవడం, రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగడంతో మూడు నెలల పాటు కల్లు డిపోలను మూసేశారు. అప్పటికే ఏళ్లుగా మందు కల్లుకు అలవాటైనవారిలో విపరిణామాలు మొదలయ్యాయి. చాలా మంది మతిభ్రమించి పిచ్చిగా ప్రవర్తించారు. కొందరు ఆత్మహత్యలకు ప్రయత్నించారు. మానసిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్న 270 మందికి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స చేయగా.. ఏడుగురు చనిపోయారు. ఇప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మందు కల్లు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు.
వరంగల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా..
ఇటీవల వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇంతేజార్‌గంజ్ పరిధిలోని లక్ష్మీపురం కల్లు కాంపౌండ్‌పై దాడిచేసి 300 లీటర్ల మందు కల్లును పట్టుకున్నారు. అసలు కల్లు అనేదే లేకుండా మొత్తంగా నీళ్లు, రసాయనాలతో కల్లు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. కల్లు తయారీకి వాడుతున్న ఆల్ఫ్రాజోలం, అమ్మోనియా, శాకరిన్ పౌడర్, సోప్ బెర్రీ, గోబైండా పేస్ట్ స్వాధీనం చేసుకుని.. నలుగురిని అరెస్టు చేశారు.
వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న రసాయనాలు, కల్లు ప్యాకెట్లు
Comments
Please login to add a commentAdd a comment