మహిళా ఉద్యోగినిపై కత్తెరతో దాడి
తిరుపతి జిల్లాలో ఘటన
తడ : వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో.. అందరూ చూస్తుండగానే సహోద్యోగిని కత్తెరతో విచక్షణ రహితంగా పొడిచేశాడు. తిరుపతి జిల్లా తడ మండల పరిధిలోని మాంబట్టు ప్రభుత్వ పారిశ్రామిక వాడలోని అపాచీ బూట్ల పరిశ్రమల్లో శుక్రవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు.. చిట్టమూరు మండలం కుమ్మరిపాళేనికి చెందిన వెంకటాద్రి.. అదే గ్రామానికి చెందిన ఎర్రబోతు వనజ(28)ను ఏడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు.
కాగా, బురదగాలి గ్రామానికి చెందిన మీజూరు సురేష్(23) కుమ్మరిపాళేనికి వచ్చి స్థిరపడ్డాడు. అక్కడి నుంచే అపాచీలో పనికి వెళ్తున్నాడు. కొంత కాలంగా వనజను వేధించడం మొదలెట్టాడు. ఈ విషయంపై 2019, 2021లో చిట్టుమూరు పోలీస్ట్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇంకా కేసు నడుస్తోంది. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం క్యాంటీన్‌లో భోజనానికి వెళ్లిన వనజను అక్కడ మళ్లీ వేధించాడు. దీంతో ఆమె సురేష్‌ను తీవ్రంగా మందలించింది.
ఆవేశానికి గురైన సురేష్ అక్కడే ఉన్న కత్తెర తీసుకుని వనజ మెడ, శరీరంపై పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ వనజ అక్కడే కుప్పకూలిపోగా.. తోటి కార్మికులు సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు చెప్పారు. నిందితుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఎస్‌ఐ కొండపనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment