
కోల్‌కతా: కల్తీ మద్యం తాగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో జరిగింది. ఈ సంఘటనలో మరో 20 మందికిపైగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాటు సారా తాగటం వల్లే వారు మృతి చెందినట్లు బాధితుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
మంగళవారం రాత్రి నాటు సార తాగిన క్రమంలో పలువురు అస్వస్థతకు గురైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. కొందరు వాంతులు చేసుకున్నారని, అందులో కొందరు తీవ్రంగా ప్రభావితమై ఇంటిలోనే ప్రాణాలు విడిచినట్లు చెప్పారు. అనారోగ్యానికి గురైన వారిని హౌరా, టీఎల్ జైస్వాల్ ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
అత్యంత విషమ పరిస్థితిలో 20 మంది ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు.. స్థానిక పోలీస్ స్టేషన్‌కు అత్యంత సమీపంలోనే కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు పలువురు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ తర్వాత అసలు కారణం తెలుస్తుందని చెప్పారు.
ఇదీ చూడండి: షిండే మంత్రివర్గంలో చోటుకు రూ.100 కోట్లు.. ఆ ఎమ్మెల్యేకు ఆఫర్!
Comments
Please login to add a commentAdd a comment