Spurious Alcohol
-
కల్తీ మద్యం తాగి ఏడుగురు మృతి.. 20 మందికి అస్వస్థత
కోల్‌కతా: కల్తీ మద్యం తాగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో జరిగింది. ఈ సంఘటనలో మరో 20 మందికిపైగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాటు సారా తాగటం వల్లే వారు మృతి చెందినట్లు బాధితుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మంగళవారం రాత్రి నాటు సార తాగిన క్రమంలో పలువురు అస్వస్థతకు గురైనట్లు స్థానిక అధికారులు తెలిపారు. కొందరు వాంతులు చేసుకున్నారని, అందులో కొందరు తీవ్రంగా ప్రభావితమై ఇంటిలోనే ప్రాణాలు విడిచినట్లు చెప్పారు. అనారోగ్యానికి గురైన వారిని హౌరా, టీఎల్ జైస్వాల్ ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అత్యంత విషమ పరిస్థితిలో 20 మంది ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు.. స్థానిక పోలీస్ స్టేషన్‌కు అత్యంత సమీపంలోనే కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు పలువురు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ తర్వాత అసలు కారణం తెలుస్తుందని చెప్పారు. ఇదీ చూడండి: షిండే మంత్రివర్గంలో చోటుకు రూ.100 కోట్లు.. ఆ ఎమ్మెల్యేకు ఆఫర్! -
వైన్స్‌లో కల్తీ మద్యం
సాక్షి, పొదిలి (ప్రకాశం): స్థానిక ఆర్టీసీ సెంటర్ గేట్ ఎదుట ఉన్న జీఆర్ వైన్స్‌లోని పర్మిట్ రూమ్‌పై ఎన్ఫోర్స్మెంట్ సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్కడ కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం వైన్స్‌పై కూడా దాడులు నిర్వహించారు. స్థానిక ఎక్సైజ్ పోలీసుస్టేషన్లో సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సీఐ తిరుపతయ్య ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో కల్లీ మద్యం తయారీ, విక్రయాలకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని దాన్ని విక్రయిస్తున్న ఇద్దరితో పాటు, లైసెన్స్‌దారుడు, నిర్వాహకులు మొత్తం నలుగురిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. దుకాణం సిబ్బందిని విచారించగా దుకాణం లీజుదారుడి సూచనల మేరకే తాము ఈ పని చేస్తున్నట్లు అంగీకరించారన్నారు. లైసెన్స్ మద్యం దుకాణం ద్వారా కల్తీకి పాల్పడుతున్నందున జీఆర్ దుకాణం లైసెన్స్‌ను రద్దు చేయాలని ఉన్నతాధికారులకు సిఫారస్ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. లైసెన్స్‌దారుడు వి.అనిల్, లీజుదారుడు జి.రమణారెడ్డిపై కేసు నమోదు చేశామన్నారు. దుకాణంలో ఉన్న 2604 మద్యం సీసాలు, 216 బీరు బాటిళ్లు, రూ.5003 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దుకాణంలో పనిచేస్తున్న షాహిద్, అబ్దుల్ జబ్బార్‌లను అరెస్టు చేశామన్నారు. లైసెన్స్‌దారుడు, లీజుదారుడిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని చౌదరి వివరించారు. వెంటనే సమాచారం ఇవ్వాలి మద్యం దుకాణాలకు సంబంధించి అక్రమాలు జరుగుతుంటే వెంటనే సమాచారం అందించాలని చౌదరి కోరారు. కల్తీ జరుగుతున్నా, అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నా, గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నా తమ దృష్టికి తీసుకరావాలని సూచించారు. మర్రిపూడి మండలం జంగాలపల్లి దుకాణంపై దాడి చేసి లోపాలు గుర్తించి లైసెన్స్ ఆపేందుకు ఉన్నతాధికారులకు సిఫారస్ చేశామని చెప్పారు. వై.పాలెం, గిద్దలూరు, కనిగిరి, చీరాల పరిధిలో నాటుసారా తయారీ కేంద్రాలను గుర్తించి దాడులు నిర్వహించామని స్పష్టం చేశారు. -
విషపూరిత మద్యం: 80కి చేరిన మృతులు
డిస్పూర్ : అస్సాంలో విషపూరిత మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 80కి చేరింది. మృతుల్లో గోలాఘాట్‌కు చెందిన వారే 39 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరే కాక మరో 300 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేడుకలో భాగంగా తేయాకు తోటల్లో పనిచేసే కూలీలు ఈ కలుషిత మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం గోలాఘాట్‌లోని సల్మారా టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్న కూలీలు రాత్రి వేడుక చేసుకున్నారు. దానిలో భాగంగా సంజు ఒరాంగ్ అనే కూలి మద్యం తీసుకొచ్చారు. ఆ మద్యం సేవించిన కాసేపటికే ఇద్దరు మహిళలు కుప్పకూలారు. దాంతో వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషపూరిత మద్యం తీసుకోవడం వల్లే వారు మరణించినట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం మరో 13 మంది ఇదే విధంగా ప్రాణాలు కోల్పోయారు. శనివారం నాటికి మృతుల సంఖ్య 84కు చేరుకుంది. ఈ ఘటనలో మద్యం అమ్మిన వ్యక్తి సంజు ఒరాంగ్, అతడి తల్లికూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తేయాకు తోటల్లో పనిచేసే వారికి వారానికోసారి కూలీలు ఇస్తుంటారు. ఈ క్రమంలో వారికి గురువారం కూలీలు అందాయి. దాంతో పెద్ద ఎత్తున కూలీలు అక్కడకు చేరుకుని వేడుకలు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. తేయాకు తోటల్లో పనిచేసే కూలీలు వేడుకలో భాగంగా ఈ కలుషిత మద్యం సేవించడం వల్లనే ఘటన జరిగినట్లు స్థానిక పోలీస్ అధికారి పుష్‌రాజ్ సింగ్ తెలిపారు. రసాయనాలు కలిగిన క్యాన్‌లో మద్యం తీసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా కల్తీ మద్యం కారణంగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో 97 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
విషపూరిత మద్యం తాగి 17 మంది మృతి
డిస్పూర్: అస్సాంలో దారుణం చోటుచేసుకుంది. విషపూరిత మద్యం సేవించి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అసోంలోని గోలాఘాట్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. గోలాఘాట్‌లోని సల్మారా టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్న కూలీలు గురువారం రాత్రి వేడుక చేసుకున్నారు. దానిలో భాగంగా సంజు ఒరాంగ్ అనే కూలి మద్యం తీసుకొచ్చారు. ఆ మద్యం సేవించిన కాసేపటికే ఇద్దరు మహిళలు కుప్పకూలారు. దీంతో వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. విషపూరిత మద్యం తీసుకోవడం వల్లే వీరు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం మరో 13 మంది కూడా అలాగే అపస్మారక స్థితిలో పడిపోవడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది పరిస్థితి విషయంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు తెలిపారు. దాదాపు 30 మందికి పైగా వేడుకలో పాల్గొని విషపూరిత మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తేయాకు తోటల్లో పనిచేసే కూలీలు వేడుకలో భాగంగా ఈ కలుషిత మద్యం సేవించడం వల్లనే ఘటన జరిగినట్లు స్థానిక పోలీస్ అధికారి పుష్‌రాజ్ సింగ్ తెలిపారు. కెమికల్స్ కలిగిన క్యాన్‌లో మద్యం తీసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా కల్తీ మద్యం కారణంగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో 97 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
కల్తీ మద్యానికి 38 మంది బలి
కీవ్: కల్తీ మద్యం సేవించిన 38 మంది మృతి చెందారు. మరో 39 మంది తీవ్ర అస్వస్థతకు గురైచికిత్స పొందుతున్నారు. మరికొంత మంది తమ చూపును సైతం కోల్పోయిన ఘటన ఉక్రెయిన్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. మరిన్ని మరణాలు పెరిగే అవకాశం ఉందని వైద్యాధికారులు వెల్లడించారు. గత కొంత కాలంగా కల్తీ మద్యం సేవించి తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతంలో చాలా మంది మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు,ఆరోగ్యశాఖ అదికారులు పలుచోట్ల దాడులు నిర్వహించారు. కర్కోవ్ ప్రాంతంలో కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
కల్తీ మద్యం ఘటనలో మరొకరు మృతి
విజయవాడ : కల్తీమద్యం ఘటనలో మరొకరు మృత్యువాతపడ్డారు. కల్తీ రక్కసి బారినపడి గత మూడు నెలలుగా విజయవాడ చిన్నఅవుటుపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ (50) అనే వ్యక్తి సోమవారం మృతిచెందాడు. శంకర్ మృతితో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరింది.